కొయ్యూరు: జాతీయ రహదారి 516–ఈ విస్తరణ పనుల్లో భాగంగా సరకు చేరవేస్తున్న ఒక లారీ గురువారం సాయంత్రం ప్రమాదానికి గురైంది. రంపుల ప్రాంతానికి సరకు అన్లోడ్ చేసి తిరిగి వస్తుండగా, నడింపాలెం మలుపు వద్ద లారీ అదుపుతప్పి బోల్తా పడింది. ఘటనా స్థలంలో ఉన్న వారు తెలిపిన వివరాల ప్రకారం.. డ్రైవర్ మలుపు వద్ద లారీని వేగంగా పోనివ్వడంతో అదుపు తప్పి ఎడమవైపునకు పడిపోయింది. ప్రమాదం జరిగిన సమయంలో ఒక్కసారిగా పెద్ద శబ్దం రావడంతో గ్రామస్తులందరూ భయాందోళనతో ఘటనా స్థలానికి చేరుకున్నారు. లారీ ఎడమవైపునకు బోల్తా పడటంతో డ్రైవర్ సీటు వైపు ఖాళీ ఉండటంతో డ్రైవర్ ఎటువంటి గాయాలు లేకుండా సురక్షితంగా బయటపడ్డారు. పెద్ద ప్రమాదమే తప్పడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.


