కొయ్యూరు: అధికారుల అనాలోచిత నిర్ణయాలకు బూదరాళ్ల పంచాయతీకి కేటాయించిన ట్రాక్టరే నిదర్శనం. సాధారణంగా చెత్త తరలింపు కోసం రహదారులు బాగున్న ప్రాంతాలకు ట్రాక్టర్లు ఇస్తారు. కానీ, అందుకు భిన్నంగా కొండ ప్రాంతంలో ఉండి, కనీసం వాహనం వెళ్లడానికి వీలులేని బూదరాళ్ల పంచాయతీకి ట్రాక్టర్‌ను కేటాయించారు. ఫలితంగా ఆ వాహనం గత మూడేళ్లుగా మూలన పడి తుప్పు పడుతోంది.
వింత పోకడలు.. అదనపు భారం
ఈ కేటాయింపులో మరో విచిత్రం ఏమిటంటే.. ట్రాక్టర్ ఇంజిన్‌ను 2023లో ఇవ్వగా, దానికి తగిలించే ట్రాలీని (తొట్టెను) 2025 డిసెంబర్‌లో ఇచ్చారు.బూదరాళ్ల పంచాయతీకి ఇంటి పన్నుల ద్వారా వచ్చే ఆదాయం ఏడాదికి రూ. 1.30 లక్షలు కూడా దాటదు. ట్రాక్టర్‌కు డ్రైవర్ జీతం నెలకు రూ. 15 వేల చొప్పున ఏడాదికి రూ. 1.80 లక్షలు అవుతుంది. దీనికి డీజిల్, మరమ్మతుల ఖర్చులు కలిపితే ఏడాదికి రూ. 2 లక్షలు దాటుతుంది. ఆదాయం తక్కువగా ఉన్న పంచాయతీకి ఇది మోయలేని భారం.
అవసరం ఉన్న చోట ఇవ్వకపోవడమే శాపం
కొయ్యూరు మండలంలో 33 పంచాయతీలు ఉండగా, రాజేంద్రపాలెం, బూదరాళ్లను గ్రేడ్–1 పంచాయతీలుగా గుర్తించారు. బూదరాళ్లలోని ఐదు గ్రామాల్లో ట్రాక్టర్ తిరగడానికి అనువైన వీధులు పది కూడా లేవు. అదే ఈ ట్రాక్టర్‌ను రాజేంద్రపాలెం వంటి మైదాన ప్రాంత పంచాయతీకి ఇచ్చి ఉంటే ఉపయోగకరంగా ఉండేది. ప్రస్తుతం రాజేంద్రపాలెంలో రిక్షాల ద్వారా చెత్తను తరలిస్తూ ఇబ్బందులు పడుతున్నారు. ఈ విషయంపై పంచాయతీ కార్యదర్శి లీలాకృష్ణ స్పందిస్తూ.. గ్రామాల్లో ట్రాక్టర్ వెళ్లడానికి దారి లేకపోవడంతో ప్రస్తుతం రిక్షాల ద్వారానే చెత్తను తరలిస్తున్నాం. ట్రాక్టర్ వినియోగంలో లేని విషయాన్ని ఇప్పటికే ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లాం అని తెలిపారు. ఇప్పటికై నా అధికారులు స్పందించి, ఈ ట్రాక్టర్‌ను కొయ్యూరు, రాజేంద్రపాలెం లేదా చీడిపాలెం వంటి అవసరమున్న పంచాయతీలకు కేటాయించాలని స్థానికులు కోరుతున్నారు.
కొండపై గ్రామానికి ట్రాక్టర్ కేటాయింపు!


