మలేరియా
● అరకొరగా దోమ తెరల పంపిణీ
● 1.50 లక్షల కుటుంబాలకు గాను ఇచ్చింది 34వేలే
● దోమల నివారణ మందు పిచికారీ 1604 గ్రామాలకే పరిమితం
సాక్షి, పాడేరు: జిల్లాలో మలేరియా జ్వరాలు చాపకింద నీరులా విజృంభిస్తున్నాయి.కొద్ది రోజుల నుంచి వర్షాలు కురుస్తుండడం, పారిశుధ్యం కొరవడడం తదితర కారణాలతో దోమలు వృద్ధి చెంది మలేరియాను వ్యాప్తి చేస్తున్నాయి. దీంతో పలువురు జ్వరాల బారిన పడుతున్నారు. చికిత్స కోసం జిల్లా ఆస్పత్రితో పాటు పీహెచ్‌సీలకు క్యూ కడుతున్నారు. ఒక్క పాడేరు జిల్లా ఆస్పత్రిలోనే ఆరుగురు గిరిజనులు మలేరియాతో చికిత్స పొందుతున్నారు. చింతపల్లి మండలం అంజలి శనివారం పంచాయతీ సింగవరం గ్రామానికి చెందిన కిముడు దయాకర్ అనే టెన్త్ విద్యార్థి ఈనెల 9వతేదీన మలేరియాతో మృతిచెందాడు. జ్వరాల తీవ్రత ఎక్కువగా ఉండడం, గిరిజన విద్యార్థి మృతిచెందడంతో జిల్లా ప్రజలు భయాందోళన చెందుతున్నారు.చంద్రబాబు ప్రభుత్వం ఏర్పడిన నాటి నుంచి మలేరియా నిర్మూలనకు తీసుకుంటున్న చర్యలు నామమాత్రంగానే ఉన్నాయని వాపోతున్నారు.
క్రమంగా పెరుగుతున్న కేసులు
జిల్లాలోని 11 మండలాల పరిధిలో 1604 మలేరియా పీడిత గ్రామాలను మలేరియాశాఖ గుర్తించగా,ఈఏడాది జనవరి నుంచి ఇప్పటివరకు 399 మలేరియా కేసులు నమోదయ్యాయి.ఈఏడాది జనవరి 21, ఫిబ్రవరిలో 43, మార్చిలో 106, ఏప్రిల్‌లో 165,మే నెలలో ఇంత వరకు 64 మంది మలేరియా జ్వరాల బారిన పడ్డారు. ప్రస్తుతం జిల్లా ఆస్పత్రితో పాటు అరకులోయ ప్రాంతీయ ఆస్పత్రి,ముంచంగిపుట్టు,చింతపల్లి కమ్యూనిటీ ఆస్పత్రులు, పాటు పీహెచ్‌సీల పరిధిలో మలేరియా కేసులు నమోదవుతున్నాయి. ప్రైవేట్ ఆస్పత్రులకు మలేరియా రోగుల తాకిడి ఎక్కువగా ఉంది.కొంతమంది రోగులు మైదాన ప్రాంత ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. పాడేరు జిల్లా ఆస్పత్రిలో మలేరియా కేసులకు అత్యవసర వైద్యసేవలు అందిస్తున్నారు.ప్రస్తుతం పాడేరు పట్టణ పరిధిలోని లోచలిపుట్టుకు చెందిన కె.నీలకంఠం,బక్కలపనుకుకు చెందిన వంతాల భాస్కరరావు,వంట్లమామిడి గ్రామానికి చెందిన జనపరెడ్డి జస్వంత్,జి.మాడుగుల మండలం పెదలోచలి పంచాయతీ ఇందుగుల గ్రామానికి చెందిన భార్యభర్తలు సీదరి బంగారయ్య,చిలకమ్మ,మరో గిరిజనుడు జగ్గారావులు మలేరియా జ్వరాలతో వైద్యసేవలు పొందుతున్నారు.
చిరిగిన దోమతెరలు చూపిస్తున్న ఎర్రగుప్ప ఆదివాసీలు
భయపెడుతున్న దోమలు
జిల్లాలో పలు ప్రాంతాలు దోమల అడ్డాగా మారాయి. జిల్లా కేంద్రం పాడేరుతో పాటు గ్రామాల్లోను అదే పరిస్థితి.సాయంత్రం 4గంటల నుంచే దోమలు దాడి చేస్తుండడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. పాడేరులో మలేరియా కేసులు నమోదవుతున్నప్పటికీ ఇంతవరకు ఏ ఒక్క ఇంటి వద్ద దోమల నివారణ మందు పిచికారీ చేయలేదు.జిల్లాలో 3,500 గ్రామాలుండగా,1,604 గ్రామాల్లోనే దోమల నివారణ మందు పిచికారీ చేశారు. ఆయా గ్రామాల్లో కూడా పూర్తి స్థాయిలో పనులు జరపలేదని విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
ఐదు నెలల్లో 399 కేసులు ఓ గిరిజన విద్యార్థి మృతి
జిల్లా కేంద్రం పాడేరులోనూమలేరియా కేసులు
భయాందోళన చెందుతున్న ప్రజలు
నివారణపై కూటమి ప్రభుత్వం నిర్లక్ష్యం
34,900 దోమతెరలే పంపిణీ
జిల్లాలో అన్ని గ్రామాల్లోను దోమల బెడద అధికంగా ఉంది. దోమ కాట్లతో ప్రజలు ఇబ్బందులు పడుతుంటే చంద్రబాబు ప్రభుత్వం మాత్రం అరకొరగా దోమతెరలను పంపిణీ చేసింది. 1.50 లక్షల కుటుంబాలు ఉంటే కేవలం 34,900 దోమతెరల పంపిణీకి గత నెలలో కలెక్టర్ నిశాంతి ప్రారంభించారు. అవి కనీసం మలేరియా పీడిత గ్రామాలకు కూడా సరిపడని పరిస్థితి. గత ఏడాది ఒక్క దోమతెర కూడా పంపిణీ చేయలేదు. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ హయాంలో పంపిణీ చేసిన దోమతెరలనే ప్రస్తుతం గిరిజనులు వినియోగిస్తుండగా, వాటికి కాలం చెల్లడంతో చిరిగిపోయాయి. దోమతెరలు లేక దోమకాట్లతో గిరిజనులు రాత్రి సమయంలో నరకయాతన అనుభవిస్తున్నారు.


