లోతుగెడ్డ రేంజ్‌లో చిరుత సంచారం | - | Sakshi
Sakshi News home page

లోతుగెడ్డ రేంజ్‌లో చిరుత సంచారం

May 13 2026 12:56 AM | Updated on May 13 2026 12:56 AM

అప్రమత్తంగా ఉండాలి

డీఆర్వో అప్పారావు సూచన

చింతపల్లి: మండలంలోని లోతుగెడ్డ అటవీ రేంజ్‌ పరిధిలోని బందబయలు, లింగాలగుడి పరిసర ప్రాంతాల్లో చిరుతపులి సంచరిస్తోందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని లోతుగెడ్డ డీఆర్వో అప్పారావు సూచించారు. మంగళవారం బందబయలు, లింగాలగుడి గ్రామాల్లో అటవీశాఖ అధికారులు దండోరా వేయించి ప్రజలకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సోమవారం లింగాలగుడి గ్రామానికి చెందిన ఓ గిరిజనుడి మేకను చిరుత ఎత్తుకెళ్లిందని, అలాగే మరో గిరిజనుడిపై దాడి చేయబోగా అతను చాకచక్యంగా తప్పించుకున్నాడని తెలిపారు. లింగాలగుడి పరిసరాల్లో చిరుతపులి అడుగుజాడలను గుర్తించినట్లు ఆయన పేర్కొన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో చిరుత గ్రామాలపై పడి పశువులు, మనుషులపై దాడి చేసే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో గిరిజనులు పంట చేలకు, ఊటగెడ్డలకు, అటవీ ప్రాంతాలకు ఒంటరిగా వెళ్లరాదని హెచ్చరించారు. ముఖ్యంగా రాత్రి సమయాల్లో మరింత అప్రమత్తంగా ఉండాలని కోరారు. చిరుతపులి ఆ ప్రాంతం నుంచి వెళ్లిపోయే వరకు అటవీశాఖ గాలింపు చర్యలు కొనసాగుతాయని, ప్రజలు సహకరించాలని కోరారు. ఒకవేళ చిరుత పశువులపై దాడి చేస్తే వెంటనే అటవీశాఖకు సమాచారం అందించాలని, ప్రభుత్వం నుంచి నష్టపరిహారం అందేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఫారెస్ట్‌ సెక్షన్‌ అధికారి బాబూరావు, ఎఫ్‌బీవోలు నాగరత్నం, సర్దార్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement