నేటి నుంచి శుభకార్యాలకు బ్రేక్‌ | - | Sakshi
Sakshi News home page

నేటి నుంచి శుభకార్యాలకు బ్రేక్‌

May 14 2026 12:31 AM | Updated on May 14 2026 12:31 AM

● 36 రోజుల పాటు వివాహాలకు విరామం ● అడ్డంకిగా మారిన అధిక మాసం, శూన్యమాసం

మహారాణిపేట(విశాఖ) : వివాహాలు, గృహప్రవేశాలు, ఉపనయనాలు, నిశ్చితార్థాలుం ఇలా శుభకార్యాలతో కళకళలాడే వేళకు తాత్కాలికంగా విరామం పడింది. గురువారం నుంచి వరుసగా 36 రోజుల పాటు శుభముహూర్తాలు లేకపోవడంతో పెళ్లి బాజాలు మూగబోనున్నాయి. అధిక జ్యేష్ఠ మాసం కారణంగా మే 14 నుంచి జూన్‌ 18 వరకు వివాహాది శుభకార్యాలకు బ్రేక్‌ పడింది. వేద పండితుల ప్రకారం ఈ కాలాన్ని ‘మూఢమి’గా పరిగణిస్తారు. అందుకే పెళ్లిళ్లు, గృహప్రవేశాలు, ఉపనయనాలు వంటి ప్రధాన శుభకార్యాలను చాలామంది వాయిదా వేస్తున్నారు. అయితే అన్నప్రాసన, అక్షరాభ్యాసం, నామకరణం, సీమంతం, రిజిస్ట్రేషన్లు వంటి కార్యక్రమాలు మాత్రం నిర్వహించుకోవచ్చని పండితులు చెబుతున్నారు.

జూన్‌ 19 నుంచి మళ్లీ పెళ్లి సందడి

జూన్‌ 19న నిజ జ్యేష్ఠ మాసం ప్రారంభం కావడంతో మళ్లీ శుభముహూర్తాల సందడి మొదలుకానుంది. జూన్‌ 19, 20, 21, 24, 25, 26, 27, 28 తేదీల్లో మంచి ముహూర్తాలు ఉన్నాయని వేద పండితులు పేర్కొంటున్నారు. ఆ తర్వాత జూలై 1 నుంచి 9 వరకు కూడా వివాహాలు, గృహప్రవేశాలకు అనుకూలమైన తేదీలు ఉన్నాయి. ఆగస్టు, సెప్టెంబర్‌, అక్టోబర్‌లోనూ పలు శుభముహూర్తాలు లభించనున్నాయి. గత డిసెంబర్‌, ఈ ఏడాది ఫిబ్రవరిలో భారీగా వివాహాలు జరగడంతో పట్టణాలు, గ్రామాలు పెళ్లి వేడుకలతో కళకళలాడాయి. ఇప్పుడు మరోసారి జూన్‌ చివరి నుంచి అదే సందడి కనిపించనుంది.

పెళ్లి రంగానికి తాత్కాలిక మందగమనం

శుభముహూర్తాలు లేకపోవడంతో వివాహాలకు అనుబంధంగా ఉన్న వందలాది వృత్తులు తాత్కాలికంగా మందగించనున్నాయి. కళ్యాణ మండపాలు, కేటరింగ్‌, టెంట్‌ హౌస్‌లు, డెకరేషన్‌, పూల వ్యాపారులు, బంగారు దుకాణాలు, వస్త్ర వ్యాపారులు, ఫొటోగ్రాఫర్లు, బ్యాండ్‌ మేళాలు, ఈవెంట్‌ మేనేజ్‌మెంట్‌ సంస్థలు, హోటళ్లు, లాడ్జిలు ఇలా అనేక రంగాలపై ప్రభావం పడనుంది. అయితే జూన్‌ 19 నుంచి మళ్లీ ముహూర్తాల సీజన్‌ ప్రారంభం కావడంతో ఈ రంగాలన్నీ తిరిగి ఊపందుకోనున్నాయని వ్యాపారులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

జూన్‌ 19 వరకు ఆగాల్సిందే..

అధిక జ్యేష్ఠ మాసం కారణంగా మే 14 నుంచి జూన్‌ 18 వరకు ప్రధాన శుభకార్యాలకు విరామం ఉంటుంది. జూన్‌ 19 నుంచి మళ్లీ శుభముహూర్తాలు ప్రారంభమవుతాయి.

– అయిలూరి శ్రీనివాస దీక్షితులు

Advertisement
 
Advertisement
Advertisement