అనకాపల్లి: సెలవుల్లో వాట్సాప్ ఆదేశాల ద్వారా ఉపాధ్యాయులను ఇబ్బంది పెట్టడం సరికాదని, లిఖితపూర్వక ఉత్తర్వులు లేకుండా, కేవలం వాట్సాప్ సందేశాల ద్వారా విద్యా సంబంధిత పనులను అప్పగించడాన్ని ఆంధ్రప్రదేశ్ ఉపాధ్యాయ సంఘాల సమాఖ్య (ప్యాప్టో) జిల్లా చైర్మన్ బోయిన చిన్నారావు అన్నారు. స్థానిక డీఈవో కార్యాలయంలో సోమవారం డీఈవో గిడ్డి అప్పారావు నాయుడుకు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వేసవి సెలవుల్లో ఉపాధ్యాయులు తీవ్ర గందరగోళానికి గురవుతున్నారని, కేంద్ర కార్యాలయం నుంచి ఎటువంటి స్పష్టమైన ఆదేశాలు లేనప్పటికీ, జిల్లాలో మాత్రం మే 12 నాటికి ఫౌండేషన్ ప్లాన్, మండల ప్లాన్, స్కూల్ లెవల్ ప్లాన్‌న్లను సిద్ధం చేయాలని ఒత్తిడి చేయడం సరి కాదన్నారు. తక్షణమే ఈ ఒత్తిడి ఆపాలని, ఉపాధ్యాయుల సెలవు హక్కు గౌరవించాలని, వాట్సాప్ ద్వారా కాకుండా అధికారిక ప్రొసీడింగ్స్ ద్వారా మాత్రమే విధులు కేటాయించాలన్నారు. ఈ కార్యక్రమంలో ప్యాప్టో జిల్లా కార్యదర్శి యేశపోగు సుధాకర్‌రావు, డిప్యూటీ ప్రధాన కార్యదర్శులు ఎస్.దుర్గాప్రసాద్, గొంది చిన్నబ్బాయ్, కె. పరదేశి, కార్యవర్గ సభ్యుడు వై.శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.


