అంబులెన్సులు మూలకు.. గిరిజనుల ప్రాణాలు గాలికి.. | - | Sakshi
Sakshi News home page

అంబులెన్సులు మూలకు.. గిరిజనుల ప్రాణాలు గాలికి..

May 11 2026 8:02 AM | Updated on May 11 2026 8:02 AM

పట్టించుకోని అధికారులు

సీలేరు: జిల్లాలోని మారుమూల గిరిజన గ్రామాల్లో వైద్య సేవలు అందక గిరిజనులు విలవిలలాడుతున్నారు. అత్యవసర సమయంలో రోగులను మెరుగైన చికిత్స కోసం మైదాన ప్రాంతాలకు తరలించే అంబులెన్సులు నెలల తరబడి మూలన పడి ఉన్నా, జిల్లా అధికారులు కనీసం పట్టించుకోవడం లేదని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

సరిహద్దు ప్రాంతం.. సమస్యలు అధికం

సీలేరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఆంధ్రా– ఒడిశా సరిహద్దు ప్రాంతంలో ఉంది. ఇక్కడ రోడ్డు ప్రమాద బాధితులు, గర్భిణులు, ఇతర అత్యవసర వైద్యం అవసరమయ్యే రోగుల సంఖ్య ఎక్కువగా ఉంటుంది. మెరుగైన చికిత్స కోసం ఇక్కడి నుంచి రోగులను 150 కిలోమీటర్ల దూరంలో ఉన్న చింతపల్లి లేదా చింతూరు ఏరియా ఆసుపత్రులకు తరలించాల్సి ఉంటుంది.

మూలకు చేరిన రెండు వాహనాలు

సీలేరు ఆసుపత్రికి చెందిన ప్రధాన అంబులెన్సు మూడు నెలల క్రితం మరమ్మతులకు గురై ప్రస్తుతం పాడేరులోని గ్యారేజీలో ఉంది. దీని స్థానంలో అధికారులు ఒక పాత అంబులెన్సును కేటాయించారు. అయితే అది కేవలం నెల రోజులు మాత్రమే తిరిగి, మళ్లీ చెడిపోయింది. ప్రస్తుతం అది దుప్పులవాడ సబ్‌ సెంటర్‌ వద్ద నిరుపయోగంగా పడి ఉంది. గత మూడు నెలలుగా సీలేరు ఆసుపత్రికి సరైన అంబులెన్సు సౌకర్యం లేక రోగులు నరకయాతన అనుభవిస్తున్నారు.

జెన్‌కో అంబులెన్సే దిక్కు

ప్రస్తుతం అత్యవసర పరిస్థితుల్లో జెన్‌కో సంస్థకు చెందిన సీఎస్సార్‌ అంబులెన్సు మాత్రమే అందుబాటులో ఉంది. ఒకే వాహనం అటు జెన్‌కో ఉద్యోగులకు, ఇటు సీలేరు ఆసుపత్రి పరిధిలోని సుమారు 50 గూడాల గిరిజన ప్రజలకు సేవలు అందించాల్సి వస్తోంది. ఏకకాలంలో ఇద్దరు ముగ్గురు రోగులకు అత్యవసర పరిస్థితి ఏర్పడితే ఎవరిని తరలించాలో తెలియక సిబ్బంది, రోగుల బంధువులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. జిల్లా వైద్య శాఖ అధికారులు ఇప్పటికై నా స్పందించి సీలేరు ఆసుపత్రికి తక్షణమే ఒక నూతన అంబులెన్సును మంజూరు చేయాలని ఈ ప్రాంత ప్రజలు డిమాండ్‌ చేస్తున్నారు. అలాగే గ్యారేజీలో ఉన్న పాత వాహనాలకు త్వరితగతిన మరమ్మతులు పూర్తి చేయించి అందుబాటులోకి తీసుకురావాలని కోరుతున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement