పెదబయలులో 24 నుంచి మోదమ్మ ఉత్సవాలు | - | Sakshi
Sakshi News home page

పెదబయలులో 24 నుంచి మోదమ్మ ఉత్సవాలు

May 18 2026 6:57 AM | Updated on May 18 2026 6:57 AM

పెదబయలు: ఉత్తరాంధ్ర ప్రజల ఆరాధ్యదైవం శ్రీ మోదకొండమ్మ తల్లి జాతర ఉత్సవాల గోడపత్రికలను ఆదివారం ఉత్సవ కమిటీ సభ్యులు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కమిటీ ప్రతినిధులు మాట్లాడుతూ... ఈ నెల 24 నుంచి 26 వరకు మూడు రోజుల పాటు అమ్మవారి జాతర మహోత్సవాలను అత్యంత వైభవంగా నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ నెల 24న ఉదయం ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. అనంతరం అమ్మవారి ఉత్సవ విగ్రహం, అమ్మవారి పాదాలు, ఘటాలతో ఊరేగింపుగా వెళ్లి శతకంపట్టు వద్ద కొలువు దీరుస్తారు. అక్కడ మూడు రోజుల పాటు అమ్మవారికి ప్రత్యేక పూజలు, నైవేద్యాలు సమర్పిస్తారు. ఉత్సవాల చివరి రోజైన 26వ తేదీ మంగళవారం మధ్యాహ్నం నుంచి అమ్మవారి విగ్రహంతో భారీ ఊరేగింపు కార్యక్రమం జరుగుతుందని, అదే రోజు భక్తులు ఆలయంలో తమ మొక్కులు తీర్చుకుంటారని కమిటీ సభ్యులు వివరించారు. పాడేరు మోదకొండమ్మ ఉత్సవాలు ముగిసిన తర్వాత వారంలో పెదబయలు ఉత్సవాలు నిర్వహించడం ఇక్కడి ఆనవాయితిగా వస్తోందని వారు పేర్కొన్నారు. మూడు రోజుల పాటు రాత్రి వేళల్లో వివిధ రకాల సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. ఈ జాతర మహోత్సవాలకు భక్తులు, అన్ని వర్గాల ప్రజలు, ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులు, మండల ప్రజలు పూర్తి సహకారం అందించి విజయవంతం చేయాలని కోరారు. ఉత్సవాల నిర్వహణకు ప్రతి ఒక్కరూ స్వచ్ఛందంగా విరాళాలు అందించి అమ్మవారి కృపకు పాత్రులు కావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఉత్సవ కమిటీ అధ్యక్షుడు కిమంకరి బొంజుబాబు, కమిటీ గౌరవ పెద్దలు గంపరాయి సూరయ్య, దడియా రాంబాబు, పలాసి కొండబాబు, శశిధర్‌, చంద్రమౌళి, పలాసి తిరుపతిరావు, పాంగి పాల్గుణ, సమరెడ్డి పూర్ణయ్య తదితరులు పాల్గొన్నారు.

పోస్టర్లు ఆవిష్కరణ

Advertisement
 
Advertisement
Advertisement