పాలపొంగు | - | Sakshi
Sakshi News home page

పాలపొంగు

May 17 2026 12:42 AM | Updated on May 17 2026 12:42 AM

గిరి క్షేత్రంలో..
ముంచంగిపుట్టు, పెదబయలు మండలాల్లో విస్తారంగా బత్తిరి సాగు దుంప నుంచి పాలు సేకరణ ● ఎండబెట్టి గుండ తయారీ ప్రకృతి వనరులతో పండిస్తున్న గిరి రైతులు ● సిరులు కురిపిస్తున్న పైరు కిలో రూ.300 నుంచి రూ.350 వరకు ఆదాయం

మన్యంలో సాంప్రదాయ పంటల వైభవం మళ్లీ సంతరించుకుంది. ఆంధ్ర–ఒడిశా

సరిహద్దు గిరిజన ప్రాంతాలైన ముంచంగిపుట్టు, పెదబయలు మండలాలతో పాటు సరిహద్దు ఒడిశా పరిధిలో పాలగుండ (బత్తిరి) సాగు విస్తారంగా సాగుతోంది. పూర్వకాలం నుంచి గిరిజనుల జీవన

విధానంలో, ఆహార అలవాట్లలో ప్రత్యేక స్థానం సంపాదించుకున్న ఈ పంటకు ప్రస్తుత వేసవి సీజన్‌లో ఒక్కసారిగా డిమాండ్‌ పెరిగింది. రసాయనాలకు దూరంగా, పూర్తిగా సేంద్రియ పద్ధతుల్లో పండే ఈ పాలగుండను కొనుగోలు చేసేందుకు మైదాన ప్రాంతాల ప్రజలు సైతం ఆసక్తి చూపిస్తున్నారు. దీంతో స్థానిక వారపు

సంతల్లో వ్యాపారం జోరుగా సాగుతోంది.

ముంచంగిపుట్టు: ఆంధ్ర–ఒడిశా సరిహద్దు ప్రాంతాలైన ముంచంగిపుట్టు, పెదబయలుతో పాటు ఒడిశాలోని లంతాపుట్టు, మాచ్‌ఖండ్‌, ఒనకడిల్లీ ప్రాంతాల్లో పాలపిండి (బత్తిరి) సాగు విస్తారంగా జరుగుతోంది. పూర్వకాలం నుంచి గిరిజన ప్రాంతాల్లో ఈ పంటకు ప్రత్యేక స్థానం ఉంది. ప్రస్తుతం వేసవి కావడంతో మార్కెట్‌లో దీని ధర ఒక్కసారిగా పెరిగింది. ముంచంగిపుట్టు మండలంలో కరిముఖిపుట్టు, కించయిపుట్టు, సుజనకోట, బంగారుమెట్ట, పెదబయలు మండలంలో పన్నెడ, గోమంగి, గంపరాయి, గలగండ పంచాయతీ పరిధిలోని గ్రామాల్లో విరివిగా సాగుచేస్తున్నారు.

శాసీ్త్రయ నేపథ్యం..

ఈ మొక్కను శాసీ్త్రయంగా కర్క్యుమా ఆంగుస్టిఫోలియా అని పిలుస్తారు. దీనినే ’ఈస్ట్‌ ఇండియన్‌ యారోరూట్‌’ అని కూడా అంటారు. ఇది ఉష్ణమండల పంట. వేడి, తేమతో కూడిన వాతావరణం ఈ సాగుకు చాలా అనుకూలం.నీరు నిల్వ ఉండని, సారవంతమైన ఇసుకతో కూడిన లోమ్‌ నేలల్లో మంచి దిగుబడి వస్తుంది. పైరు పసుపు మొక్కను పోలి ఉంటుంది.

● వర్షాకాలం ప్రారంభమయ్యే జూన్‌ మొదటి వారంలో తల్లి దుంపలను లేదా చిన్న చిన్న దుంప ముక్కలను విత్తనంగా వాడి నాటుకుంటారు.

● వరుసల మధ్య 30–45 సెంటీమీటర్లు, మొక్కల మధ్య 15–20 సెంటీమీటర్ల దూరం ఉండేలా 5–7 సెంటీమీటర్ల లోతున నాటాలి.

● ఎకరాకు 8–10 టన్నుల పశువుల ఎరువు వేసుకోవాలి. రసాయన ఎరువుల కంటే సేంద్రియ ఎరువులే ఈ పంటకు మేలు చేస్తాయి.

● ఇది ఏడు నుంచి తొమ్మిది నెలల పంట. ఆకులు పసుపు రంగులోకి మారి ఎండిపోతున్నప్పుడు (జనవరి–ఫిబ్రవరిలో) పంట కోతకు వస్తుంది. ఎకరాకు సుమారు 10–15 టన్నుల పచ్చి దుంపల దిగుబడి వస్తుంది.

తయారీ.. శ్రమతో కూడిన ప్రక్రియ

దుంపల నుంచి పిండిని సేకరించడం ఎంతో ఓపికతో కూడిన పని. మొదట దుంపలను సేకరించి శుభ్రం చేస్తారు. వాటిని జల్లెడపై గంటల తరబడి రుద్ది, పిప్పి నుంచి రసాన్ని సేకరిస్తారు. దీనినే బత్తిరి పాలు అంటారు. ఈ రసాన్ని రాత్రంతా నిల్వ ఉంచి (ఊరబెట్టి), మరుసటి రోజు ఉదయం చాపలపై లేదా పాత్రల్లో పోసి ఎండబెడతారు. సుమారు వారం రోజుల తర్వాత అది గట్టిగా కేకు ఆకారంలో మారుతుంది. అప్పుడు చిన్న ముక్కలుగా కోసి భద్రపరుస్తారు.

● గిరిజన రైతులు వారపు సంతల్లో కిలో రూ.300 నుంచి రూ.350 వరకు విక్రయిస్తున్నారు. మైదాన ప్రాంతాల్లో దీని ధర కిలో రూ.500 పైనే పలుకుతోంది. పాలపిండి వల్ల ఎటువంటి దుష్ప్రభావాలు ఉండవు. ఇది శరీరంలో రోగ నిరోధక శక్తిని పెంచుతుంది. నీరసంగా ఉన్నవారికి, చిన్నారులకు ఇది మంచి శక్తినిచ్చే ఆహారమని గిరిజనులు చెబుతున్నారు.

మైదాన ప్రాంతంలో గిరాకీ

పాలగుండ నీటిని తాగడం వల్ల చలువ చేస్తుంది. ఎటువంటి ర సాయనాలు వినియోగించకుండా ప్రకృతి వనరు లతో పండించిన దుంపల నుంచి పాలపిండిని సేకరిస్తాం. ఇంట్లో నిల్వ ఉంచుకుంటాం. వారపు సంతల్లో, మండల కేంద్రాలకు తీసుకువెళ్లి విక్రయిస్తాం. మైదాన ప్రాంతాల నుంచి వచ్చి కొనుగోలు చేస్తున్నారు.

– కిల్లో బుద్రి, దొరగూడ,

ముంచంగిపుట్టు మండలం

సాగును ప్రోత్సహించాలి

పాలపిండి సాగును ఐటీడీఏ ప్రోత్సహించాలి. రాయితీపై దుంపను రైతులకు అందించాలి. పెట్టుబడి సాయం అందిస్తే సాగు విస్తీర్ణం పెరుగుతుంది. డిమాండ్‌ ఉన్న పాలపిండిని పండిస్తేనే ఆర్థికంగా మేలు కలుగుతుంది. ప్రభుత్వం, ఐటీడీఏ అధికారులు బత్తిరి సాగును ప్రోత్సహించేలా చర్యలు తీసుకోవాలి.

– పాంగి రాంబాబు, కిందుగూడ,

ముంచంగిపుట్టు మండలం

Advertisement
 
Advertisement
Advertisement