● ఉదయం 10.30 నుంచి
రాత్రి 8 గంటల వరకు పడిగాపులు
● మాకవరపాలెంలో ఆందోళనకు
దిగిన వినియోగదారులు
మాకవరపాలెం: సకాలంలో గ్యాస్ సిలిండర్లు అందక వినియోగదారులు ఇబ్బందులు పడుతున్నారు. మండలంలోని వివిధ గ్రామాల్లో ఉన్న హెచ్‌పీ గ్యాస్ వినియోగదారులకు ప్రతి శనివారం, సోమవారం గ్యాస్ సిలిండర్లను పంపిణీ చేస్తుంటారు. అయితే గత నెల రోజులుగా సకాలంలో సిలిండర్లు అందించడం లేదని వినియోగదారులు ఆరోపిస్తున్నారు. ఈ నేపథ్యంలో మండల కేంద్రంలోని సుమారు 50 మంది వినియోగదారులు ఉదయం 10.30 గంటల నుంచి రాత్రి 7.30 గంటలైనా గ్యాస్ వ్యాన్ రాకపోవడంతో పడిగాపులు కాశారు. తీరా 8 గంటలకు వ్యాన్ వచ్చినా 20 సిలిండర్లు మాత్రమే ఉండడంతో వినియోగదారులంతా ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక్కడ ఉన్న 50 మందికి సిలిండర్లు ఇచ్చే వరకు ఇక్కడ నుంచి కదిలేది లేదని ఆందోళనకు దిగారు. ఇదే విషయమై సివిల్ సప్లయి డీటీ అశోక్‌కు వినియోగదారులు ఫోన్‌లో ఫిర్యాదు చేశారు. మహిళలు ఉదయం నుంచి రాత్రి వరకు గ్యాస్ కోసం పడిగాపులు కాయాల్సివస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇకపై ఏ సమయంలో గ్యాస్ పంపిణీ చేస్తారో ముందుగా తెలియజేయాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో ఆందోళన చేస్తామన్నారు. దీనిపై స్పందించిన డీటీ మాట్లాడుతూ సిలిండర్ల కోసం ఉన్న 50 మందికీ గ్యాస్ పంపిణీ చేస్తామని తెలిపారు. సోమవారం నుంచి ఏ సమయంలో గ్యాస్ అందజేస్తామనే విషయాన్ని వినియోగదారులకు తెలియజేయడంతో పాటు నిర్ణీత సమయానికి అందేలా చర్యలు తీసుకుంటామన్నారు.


