కశింకోట: జిల్లాలోని ఉపాధ్యాయులంతా ప్రభుత్వ పాఠశాలల్లోని ఒకటో తరగతిలో ప్రవేశాలు కల్పించడానికి చర్యలు తీసుకోవాలని విశాఖ ప్రాంతీయ సంయుక్త సంచాలకుడు బి. విజయకుమార్ ఆదేశించారు. గురువారం స్థానిక సెయింట్ జాన్స్ స్కూలులో జిల్లా స్థాయిలో మండల విద్యా శాఖ అధికారులు, క్లస్టర్ ప్రధానోపాధ్యాయులు, హైస్కూలు ప్లస్ ప్రధానోపాధ్యాయులకు సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడతూ ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల ప్రవేశాలను పెంపొందిస్తూ బలోపేతం చేయాలన్నారు. జిల్లా విద్యా పరంగా అన్ని అంశాల్లో ముందుండాలన్నారు. పదో తరగతి పునశ్చరణ తరగతులు నిర్వహించి మార్చిలో ఉత్తీర్ణులు కాని వారందరిని అడ్వాన్స్ సప్లిమెంటరీలో పాస్ కావడానికి ప్రతి ఉపాధ్యాయుడు బాధ్యత తీసుకోవాలన్నారు. జిల్లా విద్యా శాఖ అధికారి గిడ్డి అప్పారావు నాయుడు, రాష్ట్ర పరిశీలకుడు నాగుల్ మీరా తదితరులు పాల్గొన్నారు.


