చింతపల్లి: మలేరియాతో ఓ గిరిజన విద్యార్థి మృతి చెందిన సంఘటన అంజలిశనివారం పంచాయతీ గింగవరం గ్రామంలో శనివారం చోటుచేసుకుంది. ఈ ఘటనకు సంబంధించి మృతుడు తండ్రి కిముడు సింహాచలం తెలిపిన వివరాలిలా ఉన్నాయి. సింగవరం గ్రామానికి చెందిన కిముడు దయాకర్(15) అనకాపల్లి జిల్లా మాకవరపాలెంలోని ఓ ప్రైవేటు పాఠశాలలో చదువుతూ ఇటీవల పదో తరగతి పరీక్షా ఫలితాల్లో ప్రథమ శ్రేణిలో ఉత్తీర్ణత సాధించాడు. సెలవులు కావడంతో ఇంటి వద్దనే ఉంటున్నాడు. రెండు రోజుల క్రితం విద్యార్థికి జ్వరం రావడంతో శుక్రవారం లంబసింగి ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తీసుకెళ్లారు. వైద్య పరీక్షలు చేయగా.. మలేరియా పాజిటివ్ వచ్చిందని వైద్యాధికారి దినేష్ విద్యార్థి తండ్రి సింహాచలానికి తెలియజేశారు. ఆస్పత్రిలో మలేరియాకు సంబంధించిన మందులు లేవని, బయట మెడికల్ షాపులో కొనుగోలు చేసుకోవాలని చెప్పి ఇంటికి పంపేసినట్టు సింహాచలం తెలిపారు. ఇంటికి వెళ్లిన తరువాత బయట కొనుగోలు చేసిన మాత్రను బాలుడికి వేశారు. ఆ మాత్ర వేసిన కొంత సేపటికే బాలుడు అవస్మారక స్థితికి చేరుకోవడంతో ఆందోళన చెందిన కుటుంబ సభ్యులు వెంటనే ఆటోలో తాజంగి ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తీసుకెళ్లారు. వైద్యులు ప్రాథమిక చికిత్స చేసి చింతపల్లి ఏరియా ఆస్పత్రికి తరలించారు. అక్కడ బాలుడ్ని పరీక్షించిన వైద్యాధికారి లావణ్య అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించారు. లంబసింగి వైద్యులు పరీక్షలు చేసి, పాజిటివ్ వచ్చిన వెంటనే చింతపల్లి ఆస్పత్రికి తరలించి ఉంటే తమ బిడ్డ బతికే వాడని, వైద్యుల నిర్లక్ష్యంగా కారణంగా తమ బిడ్డ మరణించాడని బాలుడి తండ్రి కన్నీరుమున్నీరుగా విలపించాడు.
ఇటీవల పది ఫలితాల్లో
ప్రథమ శ్రేణిలో ఉత్తీర్ణత


