సాక్షి, విశాఖపట్నం: ఆంధ్రా– ఒడిశా ఉమ్మడి నిర్వహణలో ఉన్న బలిమెల జలాశయం నీటి వినియోగంపై ఇరు రాష్ట్రాల అధికారులు బుధవారం ఒడిశాలోని ఒనకడిల్లీ లో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఇరు రాష్ట్రాలు 2025– 2026 నీటి సంవత్సరంలో బలిమెల జలాశయం నుంచి ఎంతెంత వాడుకున్నారో లెక్కించారు. ఈ నీటి సంవత్సరంలో ఏప్రిల్ 2026 నాటికి ఒడిశా 77.3178 టీఎంసీలు, ఆంధ్రా తన వాటాగా ఏప్రిల్ 2026 నాటికి 57.7851 టీఎంసీల నీటిని వినియోగించుకున్నట్లు గుర్తించారు. దీని ప్రకారం ఇప్పటి వరకు ఒడిశా ఆంధ్రా కంటే 14.6480 టీఎంసీల నీటిని అధికంగా వాడుకున్నట్లు స్పష్టం చేశారు. ప్రస్తుతం బలిమెలలో 37.27 టీఎంసీలు, జోలాపుట్టులో 6,6312 టీఎంసీలు నిల్వలు ఉన్నాయని, ఈ నెలాఖరు నాటికి బలిమెలకు నదీ పరివాహక ప్రాంతం నుంచి ఒక టీఎంసీ నీటి నిల్వలు చేకూరుతాయని వెల్లడించారు. జోలాపుట్టులో 0.90 టీఎంసీల నీటి నిల్వలు వచ్చి చేరుతాయని, కలిపి బలిమెల, జోలాపుట్టులో మొత్తంగా 45.8012 టీఎంసీల నీటి నిల్వలు ఉన్నట్లు లెక్కలు కట్టారు. ఇందులో ఏపీ వాటాగా 32.66695 టీఎంసీలు, ఒడిశా వాటాగా 13.13425 టీఎంసీలు పంపకాలు జరిపారు. ప్రస్తుతం విద్యుత్ డిమాండ్, ఇరిగేషన్ అవసరాల నిమిత్తంగా ఆంధ్రాకు ఆరు వేల క్యూసెక్కులు, ఒడిశాకు 3100 క్యూసెక్కుల నీటిని వినియోగించుకునేందుకు ఇరు రాష్ట్రాల అధికారుల మధ్య ఒప్పందం కుదిరింది. ఈ కార్యక్రమంలో ఒడిశా అధికారులు, సీలేరు కాంప్లెక్సు ఏపీ జెన్‌కో సూపరింటెండెంట్ ఇంజనీర్ జాకీర్ హుస్సేన్, ఈఈ టి.అప్పలనాయుడు పాల్గొన్నారు.


