చింతపల్లి: మన్యంలో నాణ్యమైన కాఫీ దిగుబడులు సాధించడానికి రైతు ఉత్పత్తిదారుల సంఘాలకు కేంద్ర కాఫీ బోర్డు పూర్తి సహకారం అందిస్తుందని బోర్డు సీఈఓ ఎం. కూర్మారావు అన్నారు. బుధవారం చింతపల్లి మండలంలో కేంద్ర కాఫీ బోర్డు చైర్మన్ ఎంజే దినేష్‌తో కలిసి ఆయన పర్యటించారు. ముందుగా పెంటపాడు గ్రామంలోని మాతోట రైతు ఉత్పత్తిదారుల సంఘం నిర్వహిస్తున్న కాఫీ పల్పింగ్ యూనిట్‌ను అధికారులు పరిశీలించారు. గంతన్నదొర రైతు ఉత్పత్తిదారుల సంఘం కేంద్ర కాఫీ బోర్డు సహకారంతో నిర్మించిన సోలార్ టన్నల్ డ్రయర్‌ను వారు ప్రారంభించారు. గంతన్నదొర ఎఫ్‌పీవోకు సోలార్ టన్నల్ ఏర్పాటు కోసం కాఫీ బోర్డు రూ.12 లక్షల ఆర్థిక సాయం అందించిందని సీఈవో తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మాతోట, గంతన్నదొర రైతు సంఘాల పరిధిలోని గిరిజన రైతులు పండిస్తున్న కాఫీని శాసీ్త్రయంగా ప్రాసెస్ చేయడం ద్వారా నాణ్యమైన దిగుబడి వస్తుందని, దీనివల్ల మార్కెట్‌లో మంచి గిట్టుబాటు ధర లభిస్తుందని పేర్కొన్నారు. రైతు ఉత్పత్తిదారుల సంఘాలు చేపడుతున్న అధునాతన ప్రాసెసింగ్ పద్ధతులను సామాన్య రైతులందరూ అనుసరించాలని ఆయన కోరారు. అనంతరం ఐటీడీఏ, మాక్స్ సంస్థ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న కాఫీ ఎకో పల్పింగ్ యూనిట్‌ను పరిశీలించి, రైతులకు అందుతున్న సేవల గురించి ఆరా తీశారు. ఈ కార్యక్రమంలో సీసీఆర్‌ఐ డైరెక్టర్ ఆఫ్ రీసెర్చ్ డాక్టర్ సెంథిల్ కుమార్, జాయింట్ డైరెక్టర్ శివకుమార్, పాడేరు హెచ్‌ఆర్ మురళీధర్, ఆర్‌సీఆర్‌ఎస్ ఇన్‌ఛార్జ్ సునీల్ బాబు, జేఎల్‌ఓ రవికుమార్, కాఫీ ఏడీ బొంజుబాబు, గిరిజన వికాస సంస్థ సీఈఓ ఎన్. సత్యనారాయణ, మాతోట సీఈఓ చిన్నారావు పాల్గొన్నారు.
కాఫీ బోర్డు సీఈవో కూర్మారావు


