దేవరాపల్లి: అనారోగ్యంతో మృతి చెందిన తండ్రికి ఓ కుమార్తె తల కొరివి పెట్టి రుణం తీర్చుకుంది. పలువుర్ని కంటతడి పెట్టించిన ఈ ఘటన మండలంలోని పెదనందిపల్లి గ్రామంలో బుధవారం జరిగింది. పెదనందిపల్లి గ్రామానికి చెందిన వేచలపు గోవింద అనారోగ్యంతో మంగళవారం రాత్రి మృతి చెందారు. ఆర్టీసీ కండక్టర్‌గా పనిచేసి, ఉద్యోగ విరమణ చేసిన గోవిందకు భార్య, నలుగురు కుమార్తెలు ఉన్నారు. వీరిలో ముగ్గురు కుమార్తెలకు వివాహం అయింది. కుమారులు లేకపోవడంతో పెద్ద కుమార్తె అంజలి తల కొరివి పెట్టడానికి ముందుకు వచ్చింది. కుండ పట్టుకుని తండ్రి అంతిమ యాత్రలో పాల్గొని, దహన సంస్కారాలు పూర్తిచేసింది. అంజలి విశాఖపట్నంలోని యూనియన్ బ్యాంక్ మేనేజర్‌గా పనిచేస్తోంది. తండ్రికి కుతూరు తల కొరివి పెట్టిన దృశ్యాని చూసిన ప్రతీ ఒక్కరూ కన్నీటి పర్యంతమయ్యారు. ఈ ఘటనతో పెదనందిపల్లిలో విషాదఛాయలు అలుముకున్నాయి.


