భక్తజన ప్రమోదంగా.. | - | Sakshi
Sakshi News home page

భక్తజన ప్రమోదంగా..

May 18 2026 6:57 AM | Updated on May 18 2026 6:57 AM

పాడేరు: గిరిజనుల ఇలవేల్పు, ఉత్తరాంధ్ర ప్రజల ఆరాధ్యదైవం పాడేరు శ్రీ మోదకొండమ్మ అమ్మవారి రాష్ట్ర గిరిజన జాతర ఉత్సవాలు ఆదివారం అత్యంత ఘనంగా ప్రారంభమయ్యాయి. ఉదయం అమ్మవారికి స్థానిక ఎమ్మెల్యే, ఆలయ కమిటీ చైర్మన్‌ విశ్వేశ్వరరాజు, కలెక్టర్‌ నిశాంతి, జాయింట్‌ కలెక్టర్‌ తిరుమణి శ్రీపూజ, ఉత్సవ కమిటీ అధ్యక్షురాలు ఈశ్వరి తదితరులు హాజరై ప్రత్యేక పూజలు నిర్వహించారు.

వైభవంగా అమ్మవారి ఊరేగింపు

ఉత్సవాల ప్రారంభం సందర్భంగా తొలుత అమ్మవారి ఉత్సవ విగ్రహాన్ని ఎమ్మెల్యే విశ్వేశ్వరరాజు తలపై ఎత్తుకోగా, అమ్మవారి పాదాలను, ఘటాలను కలెక్టర్‌ నిశాంతి, జాయింట్‌ కలెక్టర్‌ శ్రీపూజ, ఉత్సవ కమిటీ అధ్యక్షురాలు ఈశ్వరి కొద్దిసేపు తమ తలపై మోశారు. అనంతరం అమ్మవారి ఆలయం నుంచి సుమారు కిలోమీటరు దూరంలో ఉన్న సతకం పట్టు వరకు ఊరేగింపు సాగింది. వేదమంత్రోచ్ఛారణలు, మేళతాళాలు, డప్పు వాయిద్యాలు, సన్నాయి మేళాలు, నేలవేషాలు, వివిధ రకాల సంప్రదాయ నృత్యాల నడుమ ఈ ఊరేగింపు అత్యంత వైభవంగా నిర్వహించారు.

● అమ్మవారి ఉత్సవ విగ్రహాన్ని, పాదాలను తాకి దర్శించుకునేందుకు భక్తులు భారీ సంఖ్యలో తరలివచ్చి పోటీ పడ్డారు. ఊరేగింపు అనంతరం సతకం పట్టు వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించి, అమ్మవారి ఉత్సవ విగ్రహం, ఘటాలు, పాదాలను అక్కడ ప్రతిష్టించారు.

భక్తుల కోసం ప్రత్యేక బస్సులు

జాతరకు వచ్చే భక్తుల సౌకర్యార్థం పాడేరు నుంచి అన్ని ప్రధాన మార్గాల్లో 100 ప్రత్యేక బస్సులను ఆర్టీసీ నడిపింది. భక్తుల రద్దీ దృష్ట్యా పట్టణంలో ట్రాఫిక్‌ను ఇతర మార్గాల్లోకి మళ్లించారు.

సాంస్కృతిక కార్యక్రమాల ఏర్పాటు

జాతర తొలిరోజు సందర్భంగా పట్టణంలోని నాలుగు ప్రధాన కూడళ్లతో పాటు, ప్రభుత్వ జూనియర్‌ కళాశాల క్రీడా మైదానంలో అధికారులు భారీ ఎత్తున ప్రత్యేక సాంస్కృతిక కార్యక్రమాలను ఏర్పాటు చేశారు. జాతర తొలిరోజు వేడుకల్లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు.

స్టాళ్లు ప్రారంభించిన కలెక్టర్‌ నిశాంతి

ప్రభుత్వ జూనియర్‌ కళాశాల సమీపంలో రహదారి పక్కన ఏర్పాటు చేసిన ప్రభుత్వ స్టాళ్లను కలెక్టర్‌ టి. నిశాంతి, జాయింట్‌ కలెక్టర్‌ తిరుమణి శ్రీపూజ ప్రారంభించారు. ఐటీడీఏ ఆధ్వర్యంలో కాఫీ ప్రాజెక్టు, సమాచార, పౌర సంబంధాల శాఖ ఆధ్వర్యంలో ఛాయాచిత్ర ప్రదర్శన, మహిళాభివృద్ధి, శిశు సంక్షేమంపై ఐసీడీఎస్‌, గ్రామీణాభివృద్ధిపై డీఆర్డీఏ, జీసీసీ, బాల్యవివాహాల నిర్మూలనపై సీడ్‌ ఆర్గనైజేషన్‌, ఉద్యానవన శాఖ, సుగంధ ద్రవ్యాల బోర్డు తదితర ప్రభుత్వ శాఖలు స్టాళ్లను ఏర్పాటుచేశాయి. ఇక్కడ ఏర్పాటుచేసిన వైద్యారోగ్య శిబిరాన్ని ఆమె ప్రారంభించారు. ప్రభుత్వ జూనియర్‌ కళాశాల మైదానంలో అధికారికంగా ఏర్పాటు చేసిన స్టేజీపై సాంస్కృతిక కార్యక్రమాలను కలెక్టర్‌ నిశాంతి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో జాయింట్‌ కలెక్టర్‌ తిరుమణి శ్రీపూజ, పోలవరం ప్రాజెక్టు పరిపాలన అధికారి అభిషేక్‌, రాష్ట్ర సృజనాత్మక, జానపద కళాల అకాడమి చైర్మన్‌ వంపూరి గంగులయ్య, ట్రైకార్‌ డైరెక్టర్‌ కృష్ణారావు తదితరులు పాల్గొన్నారు.

జాతర ఏర్పాట్లలో ‘కూటమి’ వైఫల్యం

ఘనంగా పాడేరు మోదకొండమ్మ జాతర ప్రారంభం

ప్రత్యేక పూజలు నిర్వహించిన

ఆలయకమిటీ చైర్మన్‌ విశ్వేశ్వరరాజు

దర్శించుకున్న కలెక్టర్‌ నిశాంతి,

జేసీ తిరుమణి శ్రీపూజ

ఆలయం నుంచి సతకంపట్టు వరకు భారీగా ఊరేగింపు

ఆకట్టుకున్న సంప్రదాయ నృత్యాలు

ప్రత్యేక బస్సులు నడిపిన ఆర్టీసీ

కట్టుదిట్టమైన పోలీసు భద్రత

పాడేరు: రాష్ట్ర గిరిజన జాతరగా వైభవంగా సాగాల్సిన పాడేరు శ్రీ మోదకొండమ్మ ఉత్సవాల్లో కూటమి ప్రభుత్వ వైఫల్యం కొట్టొచ్చినట్టు కనిపిస్తోంది. అట్టహాసంగా ప్రచారం చేసుకున్న అధికార యంత్రాంగం.. క్షేత్రస్థాయిలో భక్తులు, ప్రభుత్వ సిబ్బందికి కనీస సౌకర్యాలు కల్పించడంలో ఘోరంగా విఫలమైంది. జాతర తొలి రోజైన ఆదివారం అమ్మవారి ఉత్సవ విగ్రహం, పాదాలు, ఘటాల ఊరేగింపును తిలకించేందుకు ఆలయం నుంచి సతకం పట్టు వరకు భక్తులు భారీ సంఖ్యలో పోటెత్తారు. అయితే, ఎండ తీవ్రతకు అల్లాడిపోయిన భక్తుల దాహార్తిని తీర్చేందుకు ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు కనీసం తాగునీటి సౌకర్యం కూడా అధికారులు కల్పించలేకపోయారు.

ఆహార పొట్లాలు ఐటీడీఏకే పరిమితం..

సాయంత్రం జాతరకు వచ్చే భక్తులకు ఉచితంగా ఆహార పొట్లాలు పంపిణీ చేస్తామని గొప్పలు చెప్పుకున్న నిర్వాహకులు.. తీరా చూస్తే కేవలం ఒక్క ఐటీడీఏ ఆవరణ రహదారి వద్ద మాత్రమే ఆ ప్రక్రియను ముగించారు. దీంతో కొద్దిమందికి తప్ప మెజార్టీ భక్తులకు ఆహార పొట్లాలు అందలేదు. ఇక జాతరకు పోటెత్తిన మహిళా భక్తులకు పూర్తిస్థాయిలో మరుగుదొడ్ల సౌకర్యం లేకపోవడంతో వారు పడిన అవస్థలు అన్నీ ఇన్నీ కావు.

విధుల్లో ఉన్న సిబ్బందికి ‘సొంత’ ఖర్చులు!

మరోవైపు, జాతర పర్యవేక్షణ కోసం సబ్‌ కలెక్టర్‌ కార్యాలయం వద్ద కమాండ్‌ కంట్రోల్‌ రూమ్‌ను ఏర్పాటు చేసి 24 గంటల పాటు విధుల్లో ఉండాలని 17 మంది ప్రభుత్వ సిబ్బందిని నియమించారు. వీరికి ఆహారం సంగతి దేవుడెరుగు.. కనీసం గుక్కెడు మంచినీరు కూడా అందించే నాథుడు కరువయ్యాడు. రాత్రింబవళ్లు విధుల్లో ఉండే తమను కనీసం పట్టించుకోకపోగా.. మీ సొంత డబ్బులతోనే ఆహారం ఏర్పాటు చేసుకోండి అని నిర్వాహకులు ఉచిత సలహా ఇవ్వడంపై సిబ్బంది తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారుల తీరుపై భక్తులు, ఉద్యోగులు మండిపడుతున్నారు. ఇప్పటికై నా మిగిలిన రెండు రోజులైనా అన్ని సౌకర్యాలు సక్రమంగా కల్పించాలని డిమాండ్‌ చేస్తున్నారు.

భక్తులకు కరువైన తాగునీరు

మహిళలకు తప్పని

మరుగుదొడ్ల తిప్పలు

కమాండ్‌ కంట్రోల్‌ రూమ్‌ సిబ్బందికి గుక్కెడు నీరివ్వని నిర్వాహకులు

Advertisement
 
Advertisement
Advertisement