సాక్షి, పాడేరు: నర్సింగ్ వృత్తిని దైవంగా భావించి, ప్రజలకు విశేష సేవలు అందించిన ఆదర్శ మూర్తి ఫ్లోరెన్స్ నైటింగేల్ స్మృత్యర్థం మంగళవారం జిల్లా ఆస్పత్రిలో ప్రపంచ నర్సుల దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా నైటింగేల్ చిత్రపటానికి నర్సింగ్ సూపరింటెండెంట్లు ఎం. అన్నపూర్ణ (గ్రేడ్–1), ఎం. ఇందిర, జి. చంద్రకళ (గ్రేడ్–2) పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. అనంతరం కేక్ కట్ చేసి తోటి సిబ్బందికి మిఠాయిలు తినిపించి శుభాకాంక్షలు తెలిపారు. వైద్య రంగంలో నర్సింగ్ వ్యవస్థ పోషిస్తున్న కీలక పాత్రను, వారు అందిస్తున్న సేవలను ఈ సందర్భంగా అధికారులు కొనియాడారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఆస్పత్రి నర్సింగ్ బృందం మొత్తం పాల్గొంది.
సేవ, త్యాగాలకు నిదర్శనం నర్సులు
ముంచంగిపుట్టు: సేవాభావానికి, త్యాగానికి నిదర్శనం నర్సులని స్థానిక సామాజిక ఆరోగ్య కేంద్రం సూపరింటెండెంట్ డాక్టర్ ధరణి కొనియాడారు. మంగళవారం మండల కేంద్రంలోని సీహెచ్‌సీలో ప్రపంచ నర్సుల దినోత్సవాన్ని వైద్యులు, సిబ్బంది ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మదర్ థెరిసా, ఫ్లోరెన్స్ నైటింగేల్ చిత్రపటాలకు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం నర్సులందరూ కలిసి కేక్ కట్ చేసి వేడుక జరుపుకున్నారు. వైద్య రంగంలో వారు అందిస్తున్న విశేష సేవల గురించి పలువురు ప్రసంగించారు. ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ ధరణి మాట్లాడుతూ..ఆసుపత్రుల్లో నర్సులు అందించే సేవలు వెలకట్టలేనివన్నారు. ముఖ్యంగా కరోనా కష్టకాలంలో నర్సులు తమ ప్రాణాలకు తెగించి వైద్యులతో కలిసి పనిచేశారని, ప్రజల ఆరోగ్య రక్షణలో వారు చేస్తున్న కృషి వర్ణనాతీతం అని పేర్కొన్నారు. వైద్యులు రమేష్, ఆదిత్యతో పాటు సీహెచ్‌సీ సిబ్బంది సురేష్, రమేష్, రాంబాబు, నూకాల మ్మ, వనిత, నాగమణి, తేజవతి పాల్గొన్నారు.
ఘనంగా ప్రపంచ నర్సుల దినోత్సవం


