సాక్షి, పాడేరు: తెలుగు రాష్ట్రాల భక్తుల ఆరాధ్యదేవత పాడేరులోని మోదకొండమ్మతల్లి పుట్టిన రోజు ముగింపు ఉత్సవాన్ని మంగళవారం అత్యంత ఘనంగా నిర్వహించనున్నారు.మూడు రోజుల పుట్టిన రోజు వేడుకలకు మోదకొండమ్మతల్లి ఆలయ కమిటీ చైర్మన్,పాడేరు ఎమ్మెల్యే మత్స్యరాస విశ్వేశ్వరరాజు శ్రీకారం చుట్టారు.ఆదివారం పుట్టిన రోజు ప్రారంభ ఉత్సవాన్ని ఎమ్మెల్యే ఆధ్వర్యంలో ఘనంగా జరిపారు.సోమవారం కూడా మోదమ్మకు ఆలయ అర్చకులు సుబ్రహ్మణ్యం ప్రత్యేక పూజలు చేశారు.భక్తులు అమ్మవారిని దర్శించుకున్నారు.మంగళవారం అమ్మవారి పుట్టిన రోజు ముగింపు ఉత్సవాలకు ఎమ్మెల్యే విశ్వేశ్వరరాజు ఆధ్వర్యంలో అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి.ఉదయం నుంచి మోదమ్మకు పూజలు చేయడంతో అమ్మవారి ఘటాలను ఉరేగిస్తారు.మధ్యాహ్నం భారీ ఎత్తున అన్నసమారాధన నిర్వహించనున్నారు. మధ్యాహ్నం 2గంటల నుంచి మోదమ్మ ఉత్సవ విగ్రహం,పాదాలను పాడేరు వీధుల్లో ఊరేగిస్తారు.నేలవేషాలతో పాటు పలు సాంస్కృతిక కార్యక్రమాలు,డప్పు వాయిద్యాల హోరులో మోదమ్మ ఊరేగింపు సంబరం జరగనుందని పాడేరు ఎమ్మెల్యే విశ్వేశ్వరరాజు తెలిపారు.రాత్రి కళా ప్రదర్శనలను ఏర్పాటు చేశామని,అన్ని వర్గాల భక్తులు మోదమ్మ పుట్టిన రోజు వేడుకను విజయవంతం చేయాలని ఆయన కోరారు.


