మోదమ్మకు నీరాజనం | - | Sakshi
Sakshi News home page

మోదమ్మకు నీరాజనం

May 11 2026 8:02 AM | Updated on May 11 2026 8:02 AM

ప్రత్యేక పూజలు నిర్వహి స్తున్న ఎమ్మెల్యే విశ్వేశ్వరరాజు.శివరత్నం దంపతులు,ఆలయ కమిటీ ప్రతినిధులు

విద్యుత్‌ వెలుగుల్లో మోదకొండమ్మ ఆలయం

సాక్షి, పాడేరు: తెలుగు రాష్ట్రాల గిరిజనుల ఆరాధ్యదైవం, పాడేరు గ్రామ దేవత శ్రీ మోదకొండమ్మ తల్లి పుట్టినరోజు వేడుకలు ఆదివారం అత్యంత వైభవంగా ప్రారంభమయ్యాయి. మూడు రోజుల పాటు జరిగే ఈ ఉత్సవాల తొలిరోజే పాడేరు పురవీధులన్నీ భక్తులతో కిక్కిరిసిపోయాయి.

అమ్మవారికి పట్టువస్త్రాల సమర్పణ

ఆదివారం వేకువజామున 5.30 గంటల నుంచే భక్తులు ఆలయానికి తరలివచ్చారు. ఆలయ కమిటీ చైర్మన్‌, పాడేరు ఎమ్మెల్యే మత్స్యరాస విశ్వేశ్వరరాజు, గూడెంకొత్తవీధి జెడ్పీటీసీ శివరత్నం దంపతులు అమ్మవారికి పట్టువస్త్రాలను సమర్పించారు. ఈ సందర్భంగా ఆలయ ప్రధాన అర్చకులు సుబ్రహ్మణ్యం వారికి వేద మంత్రాలతో ఘన స్వాగతం పలికారు. డప్పు వాయిద్యాల హోరులో పట్టువస్త్రాలతో ఎమ్మెల్యే దంపతులు, ఆలయ కమిటీ ప్రధాన కార్యదర్శి కిల్లు కోటిబాబు నాయుడు దంపతులు ఆలయం చుట్టూ మూడు సార్లు ప్రదక్షిణలు చేసి, అమ్మవారికి భక్తిశ్రద్ధలతో వస్త్రాలను అందజేశారు. లోక కల్యాణార్థం ఎమ్మెల్యే దంపతులు అమ్మవారికి కుంకుమ పూజలు నిర్వహించి ఉత్సవాలకు శ్రీకారం చుట్టారు.

● పుట్టినరోజు వేడుకల సందర్భంగా మోదకొండమ్మ తల్లి విగ్రహాన్ని నూతన వర్ణాలతో సుందరంగా తీర్చిదిద్దారు. ఉత్సవాల తేదీలను కూటమి ప్రభుత్వం మే 17, 18, 19 తేదీలకు మార్చినప్పటికీ, భక్తులు మాత్రం తమ మనోభావాలకు అనుగుణంగా పాత తేదీలనే పరిగణనలోకి తీసుకుని పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. మైదాన ప్రాంతాల నుంచే కాకుండా స్థానికంగా ఉన్న భక్తులు అమ్మవారిని దర్శించుకుని ఘటాలు సమర్పించారు.

● ఆలయానికి విచ్చేసిన భక్తులకు ఎమ్మెల్యే విశ్వేశ్వరరాజు ఉచిత ప్రసాదాల పంపిణీని ప్రారంభించారు. విశ్వబ్రాహ్మణ సంఘం నేత కొమ్మోజి వెంకటరమణ, పలువురు భక్తుల సహకారంతో ఆలయ కమిటీ ఆధ్వర్యంలో మధ్యాహ్నం భారీ అన్నసమారాధన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్‌సీపీ నేతలు కూడా సురేష్‌, ఉర్వశిరాణి, సుబ్రహ్మణ్యం, ఆలయ కమిటీ సభ్యులు సల్లా రామకృష్ణ, బోనంగి వెంకటరమణ పాల్గొన్నారు.

12న ప్రధాన వేడుక: ఎమ్మెల్యే విశ్వేశ్వరరాజు

శ్రీ మోదకొండమ్మ తల్లి అసలు పుట్టినరోజు వేడుకను ఈనెల 12వ తేదీన (మంగళవారం) అత్యంత వైభవంగా నిర్వహిస్తామని ఎమ్మెల్యే మత్స్యరాస విశ్వేశ్వరరాజు తెలిపారు.మంగళవారం ఉదయం 101 డప్పు వాయిద్యాల మధ్య అమ్మవారి ఘటాలను పాడేరు పురవీధుల్లో ఊరేగిస్తామని తెలిపారు. మధ్యాహ్నం భారీ అన్నసమారాధన అనంతరం అమ్మవారి ఉత్సవ విగ్రహం, పాదాలు మరియు ఘటాలతో శోభాయాత్ర ఉంటుందన్నారు.

సాంస్కృతిక ప్రదర్శనలు.. : వివిధ ప్రాంతాల నుంచి వచ్చే కళాకారుల ప్రదర్శనలు, సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేశామని, భక్తులందరూ ఈ వేడుకలో పాల్గొని అమ్మవారి కృపకు పాత్రులు కావాలని ఎమ్మెల్యే, ఆలయ కమిటీ చైర్మన్‌ విశేశ్వరరాజు కోరారు.

పాడేరులో ఆధ్యాత్మిక కాంతులు

మన్యం ఆరాధ్య దైవం పాడేరు మోదకొండమ్మ అమ్మవారు ఆదివారం నాడు కొత్త రంగుల అలంకరణలో భక్తులకు శోభాయమానంగా దర్శనమిచ్చారు. ఆలయ కమిటీ చైర్మన్‌, పాడేరు ఎమ్మెల్యే మత్స్యరాస విశ్వేశ్వరరాజు పర్యవేక్షణలో ఆలయ ప్రాంగణాన్ని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు. అమ్మవారి పుట్టినరోజు వేడుకల (జన్మదినోత్సవం) సందర్భంగా ఆలయం చుట్టూ ఏర్పాటు చేసిన విద్యుత్‌ దీపాల వెలుగులు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. రంగురంగుల అలంకరణలు, మిరుమిట్లు గొలిపే కాంతులతో ఆలయ పరిసరాల్లో ఆధ్యాత్మిక శోభ ఉట్టిపడింది. ఈ సుందర దృశ్యాన్ని చూసేందుకు, అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. ఆలయానికి విద్యుత్‌ వెలుగుల శోభ నెలకొంది.

ఘనంగా పుట్టినరోజు వేడుకలు ప్రారంభం

ఎమ్మెల్యే విశ్వేశ్వరరాజు దంపతులు

తొలిపూజలు

అమ్మవారికి పట్టు వస్త్రాల సమర్పణ

తరలివచ్చిన భక్తజనం

Advertisement
 
Advertisement
Advertisement