రావికమతం : జిల్లాలో 9 ప్రాజెక్ట్ పరిధిలో నిర్మాణ దశలో ఉన్న 208 అంగన్‌వాడీ భవనాలను పూర్తి చేసేందుకు రూ.11 కోట్లు నిధులు మంజురూ చేయాలని ప్రభుత్వానికి ప్రతిపాదనలు అందజేసామని ఐసీడీఎస్ ప్రాజెక్ట్ డైరెక్టర్ ఎన్.సూర్యలక్ష్మి తెలిపారు. మంగళవారం స్దానిక ఐసీడీఎస్ కార్యాలయంలో మంగళవారం కిశోర వికాసం కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె కిశోర వికాసంపై రూపొందించిన 18 అంశాలపై బాలికులకు అవగాహన కల్పించారు. తదనంతరం ఆమె విలేకరులతో మాట్లాడుతూ జిల్లా లో 9 ఐసీడీఎస్ ప్రాజెక్ట్‌లు పరిధిలో 1908 అంగన్‌వాడీ సెంటర్లు కొనసాగుతున్నాయని, వీటిలో నిర్మాణ దశలో ఉన్న అంగన్‌వాడీ భవనాలకు నిధులు మంజూరు చేయాలని ప్రతిపాదనలు పంపించామన్నారు. అలాగే 24 ఖాళీగా ఉన్న సూపర్ వైజర్ పోస్టులు భర్తీ చేయాలని కోరామన్నారు. అంగన్‌వాడీ కేంద్రాల్లో ఖాళీగా ఉన్న ఆయాలు, కార్యకర్తలకు సంబంధించి 236 మందిని నియమించడానికి నోటిఫికేషన్ విడుదల చేశామని ఆమె తెలిపారు. మే ఒక్కటి నుంచి జూన్ 9 వరకు వేసవి సెలవులలో కిశోర బాలికలకు కిశోర వికాసం పేరుతో కార్యక్రమం నిర్వహిస్తున్నామని, దీని ద్వారా కిశోర బాలికలకు వ్యక్తిగత పరిశుభ్రత, బాల్య వివాహాల వల్ల జరిగే అనర్థాలు, పోషకాహార ఆవశ్యకత గురించి అవగాహన కల్పిస్తున్నామని తెలిపారు. దీని కోసం ప్రతి అంగన్‌వాడీ కేంద్రం పరిధిలో 15 నుంచి 20 మందిని గ్రూపులుగా విభజించి మంగళవారం, శుక్రవారం సమావేశాలు నిర్వహిస్తున్నామని తెలిపారు. కార్యక్రమంలో సీడీపీవో మంగతాయారు, జిల్లా చైల్డ్ ప్రొటెక్షన్ ఆఫీసర్ ఎం. రమేష్ పాల్గొన్నారు.


