ముంచంగిపుట్టు: ఫొటోలు తీసుకోడానికి, ఏదైనా శుభకార్యాలకు,ఫంక్షన్లకు వెళ్తే ముఖానికి పౌడర్ రాసుకుని వెళ్లడం అందరికీ తెలుసు. గిరిజన ప్రాంతంలో ఉపాధి వేతనదారులు మాత్రం పనులు చేసేందుకు వెళ్లినప్పుడు పౌండర్ రాసుకుంటున్నారు.కేంద్ర ప్రభుత్వం ఉపాధి పనుల చేసేందుకు ముఖ గుర్తింపు ఆధారిత హాజరు ప్రవేశపెట్టింది. ఆ యాప్ సక్రమంగా పని చేయకపోవడంతో హాజరు నమోదుకాక జిల్లాలో వేతనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కొన్ని ప్రాంతాల్లో ముఖానికి పౌడర్ రాసుకుంటే కొంతమందికి హాజరు నమోదవుతోంది. దీంతో వేతనదారులు పనికి వెళ్లే ముందు తప్పనిసరిగా పౌడర్ రాసుకోవలసి వస్తోంది. సోమవారం వనుగుమ్మ పంచాయతీ పనస గ్రామంలో చాలా మంది ఉపాధి కూలీలు పౌడర్ రాసుకుని వెళ్లి ముఖ హాజరు నమోదుకు యత్నించారు. కానీ కొంతమందికే హాజరు నమోదు అయింది.దీంతో మిగిలిన వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. ముఖ హాజరు విధానాన్ని తక్షణమే రద్దు చేసి,పాత పద్ధతిలోనే పనులు కల్పించాలని వనుగుమ్మ పంచాయతీ పనసగ్రామానికి చెందిన వేతనదారులు కోరుతున్నారు.
పనసలో ముఖంపై పౌడర్‌తో వచ్చి హాజరు నమోదు చేసుకుంటున్న వేతనదారుడు
ముఖ హాజరు కోసం పని ప్రదేశంలో నిరీక్షిస్తున్న వేతనదారులు


