మిన్నంటిన సంబరం | - | Sakshi
Sakshi News home page

మిన్నంటిన సంబరం

May 13 2026 12:56 AM | Updated on May 13 2026 12:56 AM

సాక్షి, పాడేరు: మన్యవాసుల ఆరాధ్యదైవం పాడేరు మోదకొండమ్మ తల్లి పుట్టినరోజు వేడుకలు మంగళవారం అత్యంత వైభవంగా ముగిశాయి. మూడు రోజుల పాటు జరిగిన ఈ ఉత్సవాల్లో చివరి రోజైన మంగళవారం అమ్మవారి పుట్టినరోజు వేడుకలను ఆలయ కమిటీ చైర్మన్‌, పాడేరు ఎమ్మెల్యే మత్స్యరాస విశ్వేశ్వరరాజు ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు.ఉదయం 6 గంటల నుంచే భక్తుల తాకిడి మొదలైంది. ఎమ్మెల్యే విశ్వేశ్వరరాజు, శివరత్నం దంపతులు ఆలయ కమిటీ ప్రతినిధులతో కలిసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. మాజీ ఎమ్మెల్యే కొట్టగుళ్లి భాగ్యలక్ష్మి, డాక్టర్‌ టి. నర్సింగరావు దంపతులు అమ్మవారిని దర్శించుకున్నారు. భక్తులకు ఉచిత ప్రసాద వితరణ చేపట్టారు. మధ్యాహ్నం ఆలయ ప్రాంగణంలో భారీ అన్నసమారాధన నిర్వహించగా, వేలాది మంది భక్తులు అమ్మవారి ప్రసాదాన్ని స్వీకరించారు. మాజీ మంత్రి గుడివాడ అమర్‌నాథ్‌, ఉమ్మడి విశాఖ జెడ్పీ చైర్‌పర్సన్‌ జల్లిపల్లి సుభద్ర, అరకు ఎమ్మెల్యే రేగం మత్స్యలింగం, ఎమ్మెల్సీ డాక్టర్‌ కుంభా రవిబాబు, మాజీ మంత్రి పసుపులేటి బాలరాజు, మాజీ ఎమ్మెల్యేలు శోభా హైమావతిదేవి, కరణం ధర్మశ్రీ, చింతలపూడి వెంకట్రామయ్య, జీసీసీ మాజీ చైర్‌పర్సన్‌ డాక్టర్‌ శోభా స్వాతిరాణి, విశాఖపట్నంకు చెందిన నేతలు గణేష్‌గౌడ్‌, పద్మశేఖర్‌, ఎర్రంశెట్టి శ్రీనివాసరావు, తదితరులు అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ కమిటీ ప్రతినిధులు ప్రముఖులకు శాలువాలు కప్పి సత్కరించి, అమ్మవారి చిత్రపటాలను అందజేశారు.

వైభవంగా ఊరేగింపు

అమ్మవారి ఉత్సవ విగ్రహ ఊరేగింపు అత్యంత వైభవంగా సాగింది. సాయంత్రం ఎమ్మెల్యే విశ్వేశ్వరరాజు దంపతులు, ఎమ్మెల్సీ కుంబా రవిబాబు, ఆలయ కమిటీ ప్రధాన కార్యదర్శి కిల్లు కోటిబాబు నాయుడు కలిసి ఉత్సవ విగ్రహానికి కుంకుమార్చన నిర్వహించారు. అనంతరం విగ్రహాన్ని పల్లకీలో కొలువుదీర్చి, ఆలయం చుట్టూ ప్రదక్షిణ చేయించారు. పాడేరు పురవీధుల్లో సాగిన ఈ ఊరేగింపులో తీన్‌మార్‌ వాయిద్యాలు, కేరళ డప్పులు, శక్తి, పులి, రాక్షస వేషధారణలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.

విజయవంతంగా వేడుకలు

మోదకొండమ్మ తల్లి పుట్టినరోజు వేడుకల నిర్వహణపై ఎమ్మెల్యే మత్స్యరాస విశ్వేశ్వరరాజు ముందుగా ప్రకటించిన విధంగానే మే 10, 11, 12 తేదీల్లో ఉత్సవాలను దిగ్విజయంగా పూర్తి చేశారు. గత వారం రోజులుగా వర్షాలు కురుస్తున్నప్పటికీ, మంగళవారం వాతావరణం అనుకూలించడంతో ఊరేగింపు ప్రశాంతంగా, భారీ భక్తజన సందోహం మధ్య ముగిసింది.

పాడేరులో ఘనంగా

మోదమ్మ పుట్టినరోజు వేడుకలు

పురవీధుల్లో అమ్మవారి ఊరేగింపు

తరలివచ్చిన భక్తజనం

దర్శించుకున్న ప్రముఖులు

ప్రత్యేక ఆకర్షణగా సాంస్కృతిక

కార్యక్రమాలు

సత్తాచాటిన ఎమ్మెల్యే విశ్వేశ్వరరాజు

Advertisement
 
Advertisement
Advertisement