● కలెక్టర్ నిశాంతి
● మోదమ్మ జాతర నిర్వహణపై సమీక్ష
పాడేరు : పాడేరు మోదకొండమ్మ జాతర ఉత్సవాలను ఈనెల 17,18,19 తేదీల్లో అత్యంత వైభవంగా నిర్వహించేందుకు అన్ని ప్రభుత్వ శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని కలెక్టర్ టి. నిషాంతి ఆదేశించారు. జాతర ఉత్సవాల ఏర్పాట్లపై బుధవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ జాతరకు వచ్చే భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా, ఇబ్బందులు తలెత్తకుండా అన్ని ఏర్పాట్లు చేయాలన్నారు. జాతర ప్రాముఖ్యతను దృష్టిలో పెట్టుకొని అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పని చేయాలని సూచించారు. జాతరలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలకు తావులేకుండా, ట్రాఫిక్ జామ్ కాకుండా పోలీసులు అత్యంత పటిష్ట బందోబస్తు నిర్వహించాలన్నారు. పారిశుధ్యం, తాగునీటి సమస్య తలెత్తకుండా నిత్యం తాగునీరు సరఫరా చేయాలని, ప్రస్తుతం అందుబాటులో ఉన్న టాయిలెట్లతో పాటు మొబైల్ టాయిలెట్లను అందుబాటులోకి తేవాలన్నారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చే భక్తుల కోసం వంద ప్రత్యేక బస్సు సర్వీసులను 24/7 పాటు నడపాలని ఆర్టీసీ అధికారులను ఆదేశించారు. జాతర మూడు రోజుల పాటు ప్రత్యేక వైద్య శిభిరాలు నిర్వహించాలని, పూర్తి స్థాయిలో మందులను అందుబాటులో ఉంచాలని వైద్యారోగ్య శాఖ అధికారులను ఆదేశించారు. విద్యుత్ సరఫరాకు ఎటువంటి అంతరాయం లేకుండా చూడాలని ఆశాఖ అధికారులను ఆదేశించారు. అన్ని శాఖల అధికారులు ప్రభుత్వ పథకాల స్టాళ్లను ఏర్పాటు చేయాలన్నారు. భక్తుల సౌకర్యార్థం కంట్రోల్ రూమ్‌లు ఏర్పాటు చేసి 24 గంటలు అందుబాటులో ఉంచాలన్నారు. ఈ సమావేశంలో జాయింట్ కలెక్టర్ తిరుమణి శ్రీపూజ, పలు శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు.


