అక్రమ రిజిస్ట్రేషన్లు రద్దు చేసి రైతులకు న్యాయం చేయాలంటు రైతుల నిరసన
భూసేకరణకు వ్యతిరేకంగా రైతుల నిరసన
తుమ్మపాల: పీజీఆర్‌ఎస్, రెవెన్యూ క్లినిక్ కార్యక్రమం ద్వారా ప్రజల నుండి స్వీకరించిన ఆర్జీలను త్వరితగతిన పరిష్కరించాలని, ఎట్టి పరిస్థితుల్లోను రీఓపెన్ కాకూడదని వివిధ శాఖల అధికారులను కలెక్టర్ విజయ కృష్ణన్ ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో నిర్వహించిన పీజీఅర్‌ఎస్, రెవెన్యూ క్లినిక్ కార్యక్రమంలో ఆమెతో పాటు జాయింట్ కలెక్టర్ శౌర్యమాన్ పటేల్, డీఆర్వో వై.సత్యనారాయణరావు ప్రజల నుండి అర్జీలు స్వీకరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ డివిజన్, మండల, గ్రామ, వార్డు స్థాయిలలో నిర్వహించే పీజీఆర్‌ఎస్ కార్యక్రమానికి సంబంధిత అధికారులు హాజరై ఆయా స్థాయిలో సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకోవాలన్నారు.
అర్జీదారుల సమస్యల పరిష్కారానికి వారితో నేరుగా మాట్లాడాలన్నారు. పరిష్కారం అయ్యే సమస్యలను పరిష్కరించి దరఖాస్తుదారునికి తెలియజేయాలన్నారు. ఈ సందర్భంగా పీజీఆర్‌ఎస్‌కు 123, రెవెన్యూ క్లినిక్‌కు 145 మొత్తం 268 అర్జీలు అందాయి. ఈ కార్యక్రమంలో వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.
తప్పుడు రిజిస్ట్రేషన్లను తక్షణం నిలిపేయాలి..
ఏళ్ల తరబడి సాగులో ఉన్న రైతుల భూములకు అనధికారక లేఅవుట్ చూపించి తప్పుడు పద్ధతిలో చేస్తున్న రిజిస్ట్రేషన్లను తక్షణమే నిలిపివేసి రైతులకు రక్షణ కల్పించాలంటు పరవాడ మండలం దేశపాత్రునిపాలెం గ్రామస్తులు కలెక్టరేట్ వద్ద నిరసన తెలిపి వినతిపత్రం అందించారు. గ్రామంలో సర్వే నంబర్ల 274, 276, 279, 290, 291, 298, 347లో మొత్తం 60 ఎకరాల రైతుల భూమిలో కొంత భూమిని కొనుగోలు చేసిన ఓ ప్రైవేటు రియల్టర్ మిగిలిన రైతుల భూములను కూడా కలిపి అనధికారక లేఅవుట్ వేసినట్లు తెలిపారు. అనధికారక జీపీఏ పత్రాలతో ప్లాట్ల రిజిస్ట్రేషన్ చేస్తూ రైతుల భూముల్లోకి వచ్చి ముప్పుతిప్పలు పెడుతున్నారని, రౌడీమూకలతో భూముల్లోకి వచ్చి వివాదాలు సృష్టిస్తున్నట్లు తెలిపారు. తమ భూములను లాక్కునే ప్రయత్నం చేస్తున్నా పోలీసులు సివిల్ వివాదం అంటూ చేతులు దులుపుకోవడం, అధికారులు జీపీఏలతో కొనసాగిస్తున్న రిజిస్ట్రేషన్లను నిలిపివేయకపోవడంతో తీవ్రంగా నష్టపోతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. అధికారులు గ్రామాల్లో విచారణ చేపట్టి తమ భూములకు సంబంధించి సృష్టిస్తున్న తప్పుడు పత్రాలను రద్దు చేసి న్యాయం చేయాలని కోరారు.
సాగు భూములను కాపాడాలి..
ఎస్‌ఈజెడ్ నిర్మాణం కోసం కె.కోటపాడు మండలం పలు గ్రామాల్లో చేపడుతున్న బలవంతపు భూసేకరణ నిలిపేసి సాగు భూములను కాపాడాలంటు ఏపీ రైతు, వ్యవసాయ కార్మిక సంఘాల జిల్లా నాయకులు రైతులతో కలిసి కలెక్టరేట్ వద్ద నిరసన తెలిపారు. జిల్లాలో అత్యధిక రిజర్వాయర్లు కలిగి ప్రతి ఎకరం నీటి సౌకర్యంతో నిత్యం పంటలు పండే చోట ఎస్‌ఈజెడ్ అంటు భూములను సేకరించి కంపెనీలతో కలుషితం చేయడం మానుకోవాలన్నారు. అచ్యుతాపురం, పరవాడ, నక్కపల్లి ప్రాంతాల్లో ఇప్పటికే వేల ఎకరాల భూముల సేకరణ జరిగిందని, జిల్లాలో మిగిలిన భూములను వ్యవసాయ ఆధారిత ప్రాంతాలుగా అభివృద్ధి చేయాలని కోరుతూ కలెక్టర్‌కు వినతిపత్రం సమర్పించారు.
ఎస్పీ కార్యాలయానికి 65 ఆర్జీలు
అనకాపల్లి : ఎస్పీ కార్యాలయంలో సోమవారం పీజీఆర్‌ఎస్‌కు 65 అర్జీలు వచ్చాయి. ఎస్పీ తుహిన్ సిన్హా అర్జీదారుల నుంచి ఫిర్యాదులు స్వీకరించి వారి సమస్యలను తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చట్ట పరిధిలో ఉన్న సమస్యలను వారం రోజుల్లో పరిష్కారానికి కృషి చేస్తామన్నారు. కుటుంబ కలహాలు, భార్యాభర్తల మధ్య వేధింపులు, ఇతర విభాగాలకు సంబంధించిన అర్జీలు వచ్చాయన్నారు. వాస్తవాల ఆధారంగా సమస్యలు పరిష్కారానికి చర్యలు చేపట్టడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్‌బీ డీఎస్పీ జీఆర్‌ఆర్ మోహన్, సీఐ సేనం రమేష్ పాల్గొన్నారు.


