● ఫారెస్ట్ రేంజర్ మురళీకృష్ణ
ముంచంగిపుట్టు: అడవులకు నిప్పు పెట్టడం వల్ల విలువైన అటవీ సంపదతో పాటు వన్యప్రాణుల మనుగడకు ముప్పు వాటిల్లుతుందని ముంచంగిపుట్టు ఫారెస్ట్ రేంజర్ ఎం.మురళీకృష్ణ ఆందోళన వ్యక్తం చేశారు. బుధవారం మండలంలోని భూసిపుట్టు పంచాయతీ కేంద్రం, సరియాపల్లి గ్రామాల్లో అటవీశాఖ ఆధ్వర్యంలో ’అడవిలో నిప్పు.. మానవాళి మనుగడకే ముప్పు’ అనే అవగాహన కార్యక్రమం, ర్యాలీ చేపట్టారు. అనంతరం రేంజర్ మురళీకృష్ణ మాట్లాడుతూ.. వేసవిలో ఎండుటాకులు, ఎండిన చెట్ల కారణంగా చిన్న నిప్పు రవ్వ పడినా అది దావానలంలా వ్యాప్తి చెందుతుందని హెచ్చరించారు. దీనివల్ల వేలాది ఎకరాల్లోని వృక్షసంపద బూడిదవ్వడమే కాకుండా, అడవిలోని జంతువులు, పక్షులు ప్రాణాలు కోల్పోతాయన్నారు. మంటలు, పొగ వల్ల వాతావరణం కలుషితమై పర్యావరణ సమతుల్యత దెబ్బతింటుందని పేర్కొన్నారు. అడవులకు నిప్పు పెట్టడం నేరమని, అటువంటి చర్యలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అడవులను కాపాడుకోవడం ద్వారానే వన్యప్రాణులను, పర్యావరణాన్ని రక్షించుకోగలమని ఆయన పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఫారెస్ట్ అధికారులు కార్తీక్, వెంకటరాజు, శ్రీను పాల్గొన్నారు.


