పెదబయలు : మన్యం ప్రాంతంలో డోలీ మోతలు లేకుండా చేస్తాం.. ప్రతి గ్రామానికీ రోడ్డు సదుపాయం కల్పిస్తాం అని ప్రభుత్వం చేస్తున్న ప్రకటనలు కేవలం కాగితాలకే పరిమితమవుతున్నాయి తప్ప క్షేత్రస్థాయిలో అమలు కావడం లేదని చెప్పడానికి ఈ ఘటనే నిదర్శనం. పెదబయలు మండలం గోమంగి పీహెచ్‌సీ పరిధిలోని బొంగరం పంచాయతీ వెదురుగొయ్యి గ్రామంలో ఆదివారం ఒక గర్భిణి పడిన అవస్థలు స్థానికులను తీవ్రంగా కలచివేశాయి.
ప్రసవ వేదనతో..
వెదురుగొయ్యి గ్రామానికి చెందిన చిక్కుడు సిమ్మలి అనే మహిళకు ఆదివారం ఉదయం పురిటి నొప్పులు ప్రారంభమయ్యాయి. గ్రామానికి సరైన రోడ్డు సౌకర్యం లేకపోవడంతో, ఆమెను ఆసుపత్రికి తరలించేందుకు భర్త చిక్కుడు చిక్కన్న, ఆశా కార్యకర్త విజయకుమారి, బంధువులు ఇబ్బందులు పడ్డారు. గర్భిణిని సుమారు రెండు కిలోమీటర్ల దూరం కొండల మధ్య కాలినడకన వంచుర్భ గ్రామం రోడ్డు పాయింట్ వరకు నడిపించాల్సి వచ్చింది. అక్కడికి చేరుకున్నాక గోమంగి పీహెచ్‌సీ అంబులెన్స్‌కు సమాచారం అందించగా, వాహనం వచ్చిన తర్వాత ఆమెను పీహెచ్‌సీకి తరలించారు.
మెరుగైన వైద్యం కోసం తరలింపు..
సిమ్మలికి ఇది రెండో కాన్పు. గోమంగి పీహెచ్‌సీలో ఆమె ఆడ శిశువుకు జన్మనిచ్చింది. అయితే, ప్రసవ సమయంలో ఆమెకు తీవ్ర రక్తస్రావం కావడం, శరీరంలో రక్తం శాతం తక్కువగా ఉండటంతో మెరుగైన వైద్యం కోసం ముంచంగిపుట్టు ఏరియా ఆసుపత్రికి రిఫర్ చేసినట్లు వైద్యాధికారి చైతన్య తెలిపారు. ప్రస్తుతం తల్లి, బిడ్డ ఇద్దరూ క్షేమంగానే ఉన్నారని, తల్లికి అవసరమైన వైద్యం అందిస్తున్నామని వైద్యులు పేర్కొన్నారు.
గ్రామానికి రోడ్డు సౌకర్యం కల్పించాలి
తమ గ్రామానికి వెంటనే రోడ్డు సదుపాయం కల్పించాలని గిరిజన విద్యార్థి సంఘం నాయకుడు మాధవరావుతో పాటు గ్రామస్తులు డిమాండ్ చేశారు. లింగేటి పంచాయతీ లింగేరిపుట్టు నుండి వెదురుగొయ్యి గ్రామానికి, అలాగే వంచుర్భ నుండి వెదురుగొయ్యికి రోడ్లు వేయాలని కోరారు. రోడ్డు లేకపోవడం వల్ల అత్యవసర వైద్య సేవలు అందడం లేదని, చివరికి పీఎం జన్‌మన్ పథకంలో మంజూరైన ఇళ్ల నిర్మాణ సామగ్రిని కూడా గ్రామానికి తరలించలేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికై నా ప్రభుత్వం, జిల్లా అధికారులు స్పందించి సమస్యను పరిష్కరించాలని డిమాండ్ చేశారు.
రెండు కిలోమీటర్లు నడవడంతోరక్తస్రావం
వంచుర్బ నుంచి గోమంగి పీహెచ్‌సీకి అంబులెన్స్‌లో తరలింపు
ముంచంగిపుట్టు ఆస్పత్రిలో కాన్పు
తల్లీబిడ్డ క్షేమం


