మునగపాక: భూసేకరణ చేపట్టకుండా మునగపాక దరి సాగునీటి కాలువల్లో రెయిలింగ్ పనులు చేపట్టడం సరికాదని వైఎస్సార్‌సీపీ నియోజకవర్గ సమన్వయ కర్త కరణం ధర్మశ్రీ విమర్శించారు. పూడిమడక రోడ్డు విస్తరణలో భాగంగా ఎటువంటి ప్రత్యామ్నాయం చూపకుండా ప్రస్తుతం ఉన్న సాగునీటి కాలువల్లో రెయిలింగ్ పనులు చేపట్టడాన్ని ఆయన తప్పుపట్టారు. ఆదివారం వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు బొడ్డేడ ప్రసాద్‌తో కలిసి సాగునీటి కాలువలను పరిశీలించారు. ఈ సందర్భంగా ధర్మశ్రీ మాట్లాడుతూ మునగపాక, తోటాడ రెవెన్యూ పరిధిలో వేలాది ఎకరాల పంట పొలాలకు సాగునీరు అందించే కాలువలను మూసేసి రెయిలింగ్ పనులు చేపట్టడం సరికాదన్నారు. ముందుగా రైతుల నుంచి భూసేకరణ చేపట్టి కాలువల నిర్మాణాలు చేపడితే బాగుండేదన్నారు. అలా కాకుండా ప్రస్తుతం ఉన్న సాగునీటి కాలువల్లో రెయిలింగ్‌లు ఏర్పాటు చేయడం ద్వారా పంట పొలాలు ముంపునకు గురయ్యే ప్రమాదం ఉందన్నారు. ప్రభుత్వ అధికారులు ముందస్తు జాగ్రత్తలు తీసుకోకుంటే విపత్తు సమయంలో రైతులు తీవ్రంగా నష్టపోవాల్సి వస్తుందన్నారు. రహదారి విస్తరణను ఈ ప్రాంత ప్రజలతో పాటు రైతులు కూడా సమ్మతిస్తున్నారని అయితే రైతులకు నష్టం వాటిల్లేలా ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు సరికాదన్నారు. బాధితులకు ఇచ్చే పరిహారం నేరుగా అకౌంట్‌లో వేసేలా చూడాలన్నారు. బాధితులకు అండగా వైఎస్సార్‌సీపీ నిలబడుతుందన్నారు. కార్యక్రమంలో వైఎస్సార్‌సీపీ మహిళా విభాగం జిల్లా అధ్యక్షులు లోచల సుజాత,వైఎస్సార్‌సీపీ మండల కన్వీనర్ ఆడారి అచ్చియ్యనాయుడు,మాజీ ఎంపీపీ దాసరి గౌరీలక్ష్మి అప్పారావు, పాటిపల్లి ఎంపీటీసీ ఇల్లా శిరీషా నాగేశ్వరరావు పాల్గొన్నారు.
భూసేకరణ చేపట్టకుండా సాగునీటి కాలువల్లో రెయిలింగ్ పనులు సరికాదు
బాధితులకు పరిహారం
నేరుగా అందించాలి
టీడీఆర్‌లు వద్దంటున్నా ప్రభుత్వంలో కానరాని స్పందన
వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు ప్రసాద్, నియోజకవర్గ సమన్వయకర్త ధర్మశ్రీ


