● ఎనిమిది మందికి గాయాలు
● నవ వధూవరులు కుటుంబంతో
అన్నవరం వెళ్తుండగా ప్రమాదం
యలమంచిలి రూరల్: డ్రైవర్ నిద్రమత్తు,నిర్లక్ష్యం కారణంగా శనివారం నవ వధూవరులు ప్రయాణిస్తున్న కారు ప్రమాదానికి గురైంది.యలమంచిలి మండలం మర్రిబంద వద్ద 16వ నంబరు జాతీయ రహదారిపై జరిగిన ఈ ప్రమాదంలో రహదారి పక్కన నడిచి వెళ్తున్న మహిళ,కారులో ప్రయాణిస్తున్న డ్రైవర్ తల్లి తీవ్రంగా గాయపడగా మరో ఆరుగురు స్వల్పంగా గాయపడ్డారు.యలమంచిలి రూరల్ ఎస్‌ఐ ఎం.ఉపేంద్ర తెలిపిన వివరాలు..విశాఖపట్నం అక్కయ్యపాలెంలో శుక్రవారం వివాహం జరిగిన నవ వధూవరులు కుటుంబంతో అన్నవరం సత్యనారాయణస్వామి ఆలయానికి కారులో బయలుదేరారు.యలమంచిలి దాటిన తర్వాత మర్రిబంద వద్ద వీరు ప్రయాణిస్తున్న కారు రోడ్డు మధ్యలో ఉన్న డివైడర్‌ను ఢీకొంది. కారు అతివేగంగా ప్రయాణిస్తుండడంతో ముందు చక్రాలు రోడ్డుపై ఊడి పడ్డాయి.డివైడర్ పక్కనున్న సోలార్ పలకలు విరిగిపోయాయి.విరిగిన సోలార్ పలక రోడ్డు పక్కన నడిచి వెళ్తున్న మహిళపై పడడంతో ఆమె తీవ్రంగా గాయపడింది.కారులో ప్రయాణిస్తున్న ఏడుగురిలో డ్రైవర్ తల్లికి కాలు విరిగింది.మిగిలిన ఆరుగురు స్వల్పంగా గాయపడ్డారు.కారు ముందు భాగం నుజ్జవడం బట్టి ప్రమాద తీవ్రతను అర్థం చేసుకోవచ్చు.ప్రమాద సమాచారం తెలుసుకున్న వెంటనే యలమంచిలి రూరల్ ఎస్‌ఐ ఉపేంద్ర సిబ్బందితో అక్కడకు చేరుకుని పరిశీలించి, వివరాలు సేకరించారు. క్షతగాత్రులను హైవే అంబులెన్సులో అనకాపల్లి ఎన్టీఆర్ ఆస్పత్రికి తరలించారు. గాయపడిన పాదచారి రుత్తల లక్ష్మి భర్త రామారావు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్‌ఐ తెలిపారు.


