కేంద్ర గిరిజన మంత్రి దృష్టికి ఆదివాసీల సమస్యలు | - | Sakshi
Sakshi News home page

కేంద్ర గిరిజన మంత్రి దృష్టికి ఆదివాసీల సమస్యలు

May 18 2026 6:57 AM | Updated on May 18 2026 6:57 AM

పాడేరు రూరల్‌: ఆదివాసీ ప్రాంతాల్లో నూరు శాతం ఉద్యోగ రిజర్వేషన్లు కల్పించాలని, ఆదివాసీ హక్కుల చట్టాల పరిరక్షణపై రాష్ట్రపతి ఉత్తర్వులు జారీ చేయాలని ఆదివాసీ అధికార రాష్ట్రీయ మంచ్‌ జాతీయ కార్యవర్గ సభ్యుడు పి. అప్పలనర్స డిమాండ్‌ చేశారు. ఆదివారం ఢిల్లీలోని కేంద్ర గిరిజన సంక్షేమ శాఖ మంత్రి జువల్‌ ఒరామ్‌ను ఆయన అధికార నివాసంలో ఏఏఆర్‌ఎం నేషనల్‌ చైర్మన్‌ జితేంద్ర చౌదరి, జాతీయ ఉపాధ్యక్షురాలు బృందాకారత్‌, అఖిల భారత వ్యవసాయ కార్మిక సంఘం జాతీయ ప్రధాన కార్యదర్శి వెంకట్‌లతో కలిసి ప్రతినిధి బృందం మర్యాదపూర్వకంగా కలుసుకుంది. ఈ సందర్భంగా గిరిజనుల సమస్యలపై మంత్రికి వినతిపత్రాన్ని సమర్పించారు. అనంతరం అప్పలనర్స కేంద్ర మంత్రికి సమర్పించిన వినతిపత్రంలోని ముఖ్యమైన అంశాలను వివరించారు. ఐదో షెడ్యూల్‌ పరిధిలోని గిరిజన ప్రాంతాల్లో అన్ని రకాల హక్కులను పూర్తిస్థాయిలో అమలు చేయాలని కోరారు. ఎటువంటి ఆంక్షలు లేకుండా జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని నూరు శాతం అమలు చేయాలని, ప్రస్తుతం అమలు చేస్తున్న ఫేషియల్‌ అటెండెన్స్‌ విధానాన్ని తక్షణమే రద్దు చేయాలని కోరారు. అలాగే పీఎం జన్‌మన్‌ బకాయి సొమ్మును వెంటనే విడుదల చేయాలన్నారు. గ్రామసభల ఆమోదం లేకుండా గిరిజన ప్రాంతాల్లో నిర్మిస్తున్న హైడ్రోపవర్‌ ప్రాజెక్టులను తక్షణమే నిలిపివేయాలన్నారు. ఆదివాసీలకు నూరు శాతం ఉద్యోగ రిజర్వేషన్లు అమలు చేయకుండా, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టబోయే డీఎస్సీ 2026 నోటిఫికేషన్‌ ప్రక్రియను నిలిపివేయాలని కేంద్రం ఆదేశాలు జారీ చేయాలని కోరామన్నారు. గతంలో ఉన్న జీవో నంబర్‌ 3కు ప్రత్యామ్నాయంగా కొత్త జీవోను తీసుకురావాలని విన్నవించామన్నారు. గత 50 ఏళ్లుగా పెండింగ్‌లో ఉన్న నాన్‌–షెడ్యూల్‌ ఆదివాసీ గ్రామాలన్నింటినీ 5వ షెడ్యూల్‌ ప్రాంతాలలో విలీనం చేస్తూ పార్లమెంట్‌ సమావేశాల్లో బిల్లు ప్రవేశపెట్టాలని డిమాండ్‌ చేశారు. పీఎం జన్‌మన్‌ పథకం కింద ఇచ్చే ఇంటి యూనిట్‌ విలువను ప్రస్తుతం ఉన్న రూ. 3.39 లక్షల నుంచి రూ. 10 లక్షలకు పెంచాలని కోరామన్నారు. ఆదివాసీ మాతృభాషా వలంటీర్లతో పాటు ఏకలవ్య మోడల్‌ రెసిడెన్షియల్‌ పాఠశాలల్లో పనిచేస్తున్న గెస్ట్‌ ఫ్యాకల్టీలకు పూర్తి ఉద్యోగ భద్రత కల్పించాలని కోరారు. ఈ అంశాలన్నింటిపై కేంద్ర గిరిజన సంక్షేమ శాఖ మంత్రితో సానుకూలంగా చర్చించినట్లు అప్పలనర్స తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆదివాసీ గిరిజన సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె. సురేంద్ర తదితరులు పాల్గొన్నారు.

ఆదివాసీ అధికార రాష్ట్రీయ మంచ్‌

జాతీయ కార్యవర్గ సభ్యుడు అప్పలనర్స

Advertisement
 
Advertisement
Advertisement