మన్యం కాఫీకి ప్రాణం పోసి, ఐదు దశాబ్దాలుగా రైతులకు దిశానిర్దేశం చేస్తున్న ఆర్‌వీనగర్ కాఫీ పరిశోధనా కేంద్రం నేడు స్వర్ణోత్సవ మైలురాయిని చేరుకుంది. ఒక చిన్న మొక్కతో ప్రారంభమై వేలాది ఎకరాల తోటలకు విస్తరించిన ఈ కేంద్రం, మన్యం కాఫీ సాగు చరిత్రలో సరికొత్త అధ్యాయాన్ని లిఖిస్తోంది. స్వర్ణోత్సవ వేడుకల వేళ.. సరికొత్త సాగు విజ్ఞానంతో మన్యం కాఫీ కీర్తిని దశదిశలా చాటేందుకు ఈ పరిశోధనా కేంద్రం సిద్ధమైంది.
గిరి రైతుకు తోడుగా..
గూడెంకొత్తవీధి: ఒకప్పుడు కేవలం అడవి బిడ్డల జీవనాధారంగా మొదలైన కాఫీ సాగు, నేడు మన్యం ఖ్యాతిని ప్రపంచ పటంలో నిలిపింది. అరకు కాఫీ బ్రాండ్ పేరు వింటేనే అంతర్జాతీయ మార్కెట్ పులకించిపోయే స్థాయికి చేరిందంటే దానికి కారణం దశాబ్దాల కష్టం.. శాసీ్త్రయ పరిశోధనలే. సరిగ్గా ఇదే తరుణంలో, మన్యం కాఫీ సాగులో కీలక పాత్ర పోషిస్తున్న ఆర్‌వీనగర్ ప్రాంతీయ కాఫీ పరిశోధనా స్థానం యాభై వసంతాలు పూర్తి చేసుకోవడం విశేషం.
50 ఏళ్ల ప్రస్థానమిలా..
ఆర్‌వీ నగర్ ప్రాంతీయ కాఫీ పరిశోధనా స్థానాన్ని కేంద్ర కాఫీ బోర్డు ఉన్నతాధికారులు బుధవారం సందర్శించారు. బోర్డు సీఈవో ఎం. కూర్మారావు, చైర్మన్ డాక్టర్ దినేష్ కుమార్‌తో కలిసి క్షేత్రస్థాయిలో సాగువుతున్న మేలు రకపు వంగడాలను పరిశీలించారు. ఆర్‌వీనగర్ కేంద్రం ఏర్పాటు చేసి 50 ఏళ్లు పూర్తవుతున్న సందర్భంగా (గోల్డెన్ జూబ్లీ), ఇక్కడ జరిగిన పరిశోధనలు రైతుల జీవితాల్లో ఎలాంటి మార్పులు తెచ్చాయో ఇన్‌చార్జి సునీల్‌బాబు నుంచి తెలుసుకున్నారు.
నేడు ప్రత్యేక సదస్సు
ఈ స్వర్ణోత్సవ వేడుకలు పురస్కరించుకుని గురువారం అరకులోయలో ఒక భారీ సదస్సును నిర్వహిస్తున్నారు. దీని గురించి సీఈవో కూర్మారావు మాట్లాడుతూ..ఈ సదస్సు కేవలం వేడుక మాత్రమే కాదు, భవిష్యత్తు కాఫీ సాగుకు ఒక దిశానిర్దేశం. కాఫీ సాగులో అద్భుత ఫలితాలు సాధించిన రైతులు, శాస్త్రవేత్తలు,అధికారులను ఒకే వేదికపైకి తెస్తున్నాం. వారి అనుభవాలు, సూచనల ఆధారంగా రాబోయే రోజుల్లో కాఫీ దిగుబడిని, నాణ్యతను మరింత పెంచేలా కార్యాచరణ సిద్ధం చేస్తాం అని ఆయన పేర్కొన్నారు.
గిరిజన జీవితాల్లో కాఫీ విప్లవం
మన్యంలో కాఫీ కేవలం ఒక పంట కాదు, అదొక జీవనశైలి. గూడెంకొత్తవీధి, చింతపల్లి, అరకు ప్రాంతాల్లోని వేలాది గిరిజన కుటుంబాలు నేడు ఆర్థికంగా నిలదొక్కుకున్నాయంటే దానికి కాఫీ సాగే ప్రధాన కారణం. అరకు కాఫీలో ఉండే ప్రత్యేకమైన రుచి, సువాసన అంతర్జాతీయ వినియోగదారులను ఆకర్షిస్తోంది. ఆర్‌వీనగర్ పరిశోధనా కేంద్రం అభివృద్ధి చేసిన మేలురకపు మొక్కలు, తెగుళ్లను తట్టుకునే శక్తి గల వంగడాలు రైతులకు వరంగా మారాయి. భవిష్యత్తులో కాఫీ సాగును మరిన్ని గ్రామాలకు విస్తరించడమే లక్ష్యంగా బోర్డు ప్రణాళికలు రచిస్తోంది. వేడుకల ఏర్పాట్లలో కాఫీ బోర్డు ప్లానింగ్ డైరెక్టర్ డాక్టర్ శివకుమార్ స్వామి, ఆఫీస్ ఇన్‌చార్జి సునీల్ బాబు, ఏడీ బొంజు బాబు, హెచ్‌వో అరుణకుమారి, జేఎల్‌వో నాగేశ్వరరావు నాయక్ నిమగ్నమయ్యారు.
వేడుకలకు ఏర్పాట్లు పూర్తి
అరకులోయ టౌన్: స్థానిక పున్నమి హరిత వ్యాలీ రిసార్ట్స్‌లోని గోస్టి సమావేశ మందిరంలో గురువారం కేంద్ర కాఫీ బోర్డు ఆధ్వర్యంలో ఆర్‌వీనగర్ ప్రాంతీయ కాఫీ పరిశోధనా కేంద్రం స్వర్ణోత్సవ వేడుకలు నిర్వహణకు ఏర్పాట్లు పూర్తయినట్టు కాఫీ బోర్డు అధికారులు తెలిపారు. ఈ మేరకు కేంద్ర కాఫీ బోర్డు డిప్యూటీ డైరెక్టర్ హెచ్‌ఆర్ మురళీధర్, అరకులోయ జేఎల్‌వో వీవీకేఎం లక్ష్మి ఒక ప్రకటన విడుదల చేశారు. ఈ వేడుకలకు కలెక్టర్ నిశాంతి , ఐటీడీఏ పీవో ఆదిత్యవర్మ, జీసీసీ,కాఫీ బోర్డు ఉన్నతాధికారులతో పాటు కాఫీ రైతులు పెద్ద ఎత్తున పాల్గొంటారని వారు పేర్కొన్నారు.
ఆర్‌వీ నగర్ కాఫీ పరిశోధనా కేంద్రం విశేష కృషి
ఆధునిక వంగడాల సాగులో కీలకపాత్ర
గిరి రైతుల ఆర్థిక స్థితిగతుల మెరుగే లక్ష్యంగా సేవలు
వేలాది కుటుంబాలకు జీవనోపాధి
నేడు అరకులోయలో స్వర్ణోత్సవ వేడుకలు


