జాతరకు లేని బందోబస్తు.. పెళ్లిళ్లకు, ప్రైవేట్ పర్యటనలకు ఎలా వచ్చింది?
లోకేష్ సమావేశానికి రావాలని గిరిజనులను బెదిరించి తరలింపు
టీడీపీ నేతల కుట్రలకు ప్రజలే ఓటుతో బుద్ధి చెబుతారు
పాడేరు ఎమ్మెల్యే, వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు మత్స్యరాస విశ్వేశ్వరరాజు
పాడేరు: గిరిజనుల ఇలవేల్పు, ఉత్తరాంధ్ర ప్రజల ఆరాధ్యదైవం పాడేరు మోదకొండమ్మ ఉత్సవాల విషయంలో కూటమి నాయకులు కుట్రలకు తెరలేపారని పాడేరు ఎమ్మెల్యే, వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు మత్స్యరాస విశ్వేశ్వరరాజు విమర్శించారు. గురువారం తన క్యాంప్ కార్యాలయంలో పాడేరు, అరకు మాజీ ఎమ్మెల్యేలు కొట్టగుళ్లి భాగ్యలక్ష్మి, చెట్టి పాల్గుణలతో కలిసి ఆయన విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా విశ్వేశ్వరరాజు మాట్లాడుతూ ఆలయ కమిటీ, గ్రామ పెద్దలు, గిరిజన సంఘాలు, అన్ని పక్షాల ఏకగ్రీవ నిర్ణయం మేరకు ఈ నెల 10, 11, 12 తేదీల్లో జాతర నిర్వహించాలని అనుకున్నాం. కానీ, కలెక్టర్ కార్యాలయంలో సమీక్ష నిర్వహించిన ఇంచార్జ్ మంత్రి సంధ్యారాణి, గిడ్డి ఈశ్వరి రాజకీయ జోక్యంతో ఉత్సవాల తేదీలను ఏకపక్షంగా మార్చేశారన్నారు. ఎన్నికల దృష్ట్యా పోలీసు బందోబస్తు ఇవ్వలేమని, అందుకే ఉత్సవాలు నిర్వహించలేమని అప్పట్లో సాకులు చెప్పారన్నారు. మరి ఇదే నెల 13న పాడేరులో జరిగిన జీసీసీ చైర్మన్ శ్రవణ్ కుమార్ వివాహానికి, మంత్రి లోకేష్ పర్యటనకు ఐదు రోజుల ముందు నుంచే వందల సంఖ్యలో పోలీసులతో బందోబస్తు ఎలా ఏర్పాటు చేశారని ఆయన ప్రశ్నించారు. బెదిరింపులతో జనసమీకరణ చేపట్టారని ధ్వజమెత్తారు. కిడారి శ్రవణ్ కుమార్ వివాహానికి 64 ఆర్టీసీ బస్సులను ఏర్పాటు చేసి, మంత్రి లోకేష్ సమావేశానికి రాకపోతే పెన్షన్లు, రేషన్ కార్డులు, జాబ్ కార్డులు తొలగిస్తామని గిరిజనులను బెదిరించి తరలించారని ఆరోపించారు. తరలించిన ప్రజలకు కనీసం మంచినీరు, ఆహారం కూడా అందించకుండా ఇబ్బందులకు గురిచేశారని మండిపడ్డారు. మంత్రి పర్యటన, టీడీపీ నేత వివాహం కారణంగా పట్టణంలో రెండు గంటల పాటు ట్రాఫిక్ స్తంభించిపోయిందని, కనీసం అంబులెన్స్‌లకు కూడా దారి ఇవ్వలేదని విమర్శించారు. అసలు మంత్రి లోకేష్ వచ్చింది ప్రభుత్వ కార్యక్రమానికా లేక ప్రైవేట్ కార్యక్రమానికా అని ఆయన నిలదీశారు. కూటమి ప్రభుత్వం చేస్తున్న కుట్రలను ప్రజలు నిశితంగా గమనిస్తున్నారని, రానున్న ఎన్నికల్లో తమ ఓటుతో తగిన బుద్ధి చెప్పేందుకు సిద్ధంగా ఉన్నారని హెచ్చరించారు. ఈ సమావేశంలో వైస్ ఎంపీపీ కుంతూరు కనకాలమ్మ, వైఎస్సార్‌సీపీ ఎస్టీ సెల్ నియోజకవర్గ అధ్యక్షుడు శరభ సూర్యనారాయణ, మహిళా విభాగం అధ్యక్షురాలు కిల్లో ఊర్వశీరాణి, మాజీ పీఏసీఎస్ అధ్యక్షురాలు రామసత్యవతి, ఎంపీటీసీ రాజేశ్వరి, మాజీ సర్పంచ్‌లు వంతాల రాంబాబు, పాంగి నాగరాజు, నాయకులు మోద బాబురావు, పలాసి కోటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.


