రహదారి కోసం వినూత్న నిరసన | - | Sakshi
Sakshi News home page

రహదారి కోసం వినూత్న నిరసన

May 11 2026 8:02 AM | Updated on May 11 2026 8:02 AM

తాడిగుడ జలపాతం

మార్గంలో డోలీ యాత్ర

అనంతగిరి (అరకులోయ టౌన్‌): తమ గ్రామానికి రహదారి నిర్మించాలని కోరుతూ అనంతగిరి మండలంలోని అమలగుడ గ్రామ గిరిజనులు ఆదివారం వినూత్న రీతిలో నిరసన తెలిపారు. మండల కేంద్రానికి సుమారు మూడు కిలోమీటర్ల దూరంలో ఉన్న అమలగుడ నుంచి తాడిగుడ జలపాతానికి వెళ్లే మార్గంలో సుమారు రెండు కిలోమీటర్ల మేర ‘డోలీ యాత్ర’ చేపట్టి ప్రభుత్వానికి తమ గోడును వినిపించుకున్నారు.

విన్నవించినా స్పందన కరువు : ఈ సందర్భంగా గ్రామస్తులు కొర్రా గోపి, కౌసల్య మాట్లాడుతూ.. గ్రామంలో రహదారి, తాగునీటి సమస్యలను పరిష్కరించాలని గతంలోనే ‘ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక’ (గ్రీవెన్స్‌) ద్వారా కలెక్టర్‌కు, ఎంపీడీవోకు వినతిపత్రాలు సమర్పించామని తెలిపారు. అయినప్పటికీ, ఇప్పటివరకు అధికారుల నుంచి ఎటువంటి స్పందన లేదని వారు ఆవేదన వ్యక్తం చేశారు.

పర్యాటకులకు తప్పని ఇబ్బందులు : ఈ రహదారి కేవలం స్థానిక గిరిజనులకే కాకుండా, ప్రముఖ పర్యాటక ప్రాంతమైన తాడిగుడ జలపాతానికి వెళ్లే పర్యాటకులకు కూడా ప్రధాన మార్గమని వారు గుర్తు చేశారు. ప్రతిరోజూ అధిక సంఖ్యలో పర్యాటకులు ఈ మార్గంలోనే రాకపోకలు సాగిస్తుంటారని, సరైన రోడ్డు లేక అందరూ తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని వివరించారు. ఇప్పటికై నా కలెక్టర్‌ ప్రత్యేక శ్రద్ధ వహించి, అమలగుడ గ్రామం వరకు తక్షణమే రహదారి నిర్మించాలని, గ్రామంలో నెలకొన్న తాగునీటి సమస్యను పరిష్కరించాలని వారు డిమాండ్‌ చేశారు.

Advertisement
 
Advertisement
Advertisement