● నిర్లక్ష్యం చేస్తే చర్యలు
● కలెక్టర్ నిశాంతి హెచ్చరిక
● పాడేరు ఐటీడీఏలో
పీజీఆర్‌ఎస్ నిర్వహణ
పాడేరు: పీజీఆర్‌ఎస్‌లో స్వీకరించిన అర్జీలను క్షుణ్ణంగా పరిశీలించి గడువులోగా పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ టి. నిశాంతి అధికారులను ఆదేశించారు. స్థానిక ఐటీడీఏ కార్యాలయ సమావేశ మందిరంలో శుక్రవారం మీకోసం ప్రజా సమస్యల పరిష్కార వ్యవస్థ కార్యక్రమం నిర్వహించారు. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుండి వచ్చిన ప్రజల నుంచి కలెక్టర్ నిషాంతి, జాయింట్ కలెక్టర్ తిరుమణి శ్రీపూజ, ఐటీడీఏ పీవో ఆదిత్యవర్మ, ఇంచార్జీ డీఆర్వో లోకేశ్వరరావు పలు సమస్యలపై 62, రెవెన్యూ క్లినిక్‌కు సంబంధించి 41 వినతులను స్వీకరించారు. ఫిర్యాదులను ఎంత గడువులోగా పరిష్కారిస్తారో అర్జీదారులకు వివరించాలన్నారు. ప్రతి శుక్రవారం ఐటీడీఏలో నిర్వహించే పీజీఆర్‌ఎస్‌కు అన్ని శాఖల జిల్లా స్థాయి అధికారులు సమగ్ర సమాచారంతో హాజరు కావాలని, కార్యక్రమం పూర్తయ్యేంత వరకు అధికారులు ఉండాలని ఆదేశించారు. విధుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించే అధికారులపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. క్రమం తప్పకుండా ప్రతి సోమవారం మండల కేంద్రాల్లో, ప్రతి రోజు గ్రామ స్థాయిలో ప్రజల నుంచి సమస్యలపై వినతులు స్వీకరించి పరిష్కారించాలని సూచించారు. ఫిర్యాదుదారులు మీకోసం కాల్ సెంటర్ 1100 సేవలను సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో డ్వామా పీడీ విద్యసాగర్, డీఆర్‌డీఏ పీడీ మురళి, టీడబ్ల్యూ డీడీ పరిమళ, డీఎంహెచ్‌వో డాక్టర్ కృష్ణమూర్తి నాయక్, జిల్లా వ్యవసాయశాఖ అధికారి నందు, ఐసీడీఎస్ పీడీ ఝాన్షీరామ్ పడాల్, డీపీవో చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు.


