చింతపల్లి: మండలంలోని తాజంగిలో నిర్మాణంలో ఉన్న గిరిజన స్వాతంత్య్ర సమరయోధుల మ్యూజియం పనులను వేగవంతం చేసి, నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలని గిరిజన సంక్షేమ శాఖ డైరెక్టర్ సుధాభార్గవి ఆదేశించారు. గురువారం ఆమె మ్యూజియం నిర్మాణ ప్రాంతాలను సందర్శించి, పనుల పురోగతిని క్షేత్రస్థాయిలో పరిశీలించారు.
పనుల పురోగతిపై సమీక్ష
మ్యూజియంలోని బ్లాక్–1, బ్లాక్–2లలో జరుగుతున్న నిర్మాణ పనుల గురించి ఇంజనీరింగ్ అధికారులు, కాంట్రాక్టర్లతో కలిసి ఆమె సమీక్షించారు. పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా పనుల ప్రస్తుత స్థితిగతులను, నిర్మాణ నాణ్యతను క్షుణ్ణంగా అడిగి తెలుసుకున్నారు.
అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మాణం
ఈ సందర్భంగా సుధాభార్గవి మాట్లాడుతూ.. మ్యూజియం నిర్మాణం అంతర్జాతీయ ప్రమాణాలతో, గిరిజన సంస్కృతి ప్రతిబింబించేలా ఉండాలని సూచించారు. దేశ స్వాతంత్య్రం కోసం ప్రాణాలర్పించిన గిరిజన వీరుల చరిత్రను భావితరాలకు అందించడమే ఈ మ్యూజియం ప్రధాన ఉద్దేశమని ఆమె పేర్కొన్నారు.
అత్యాధునిక సాంకేతికత వినియోగం
గిరిజన వీరుల పోరాట పటిమను నేటి తరానికి వివరించేలా అత్యాధునిక డిజిటల్ టెక్నాలజీ, ఆడియో విజువల్స్ ప్రదర్శనలను ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. మ్యూజియంలో ఏర్పాటు చేసే ప్రతి శిల్పం, ప్రతి చిత్రం వారి పోరాట స్ఫూర్తిని రగిలించేలా ఉండాలని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి ఆదిత్యవర్మ, చీఫ్ ఇంజనీర్ వసంత, టీఆర్‌ఎం ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఎం. రాణి, గిరిజన సంక్షేమ శాఖ డీడీ పరిమళ, ఈఈ డేవిడ్‌రాజ్, డీఈ రఘునాథ్‌నాయుడు, జేఈ యాదకిషోర్ తదితరులు పాల్గొన్నారు.


