వీసీ కారు వెనుక పరుగెత్తినా
కరగని మనసు
వీసీకి ఎస్సీ కమిషన్
‘మోస్ట్ అర్జంట్’వార్నింగ్!
అట్రాసిటీ కేసు నమోదుకు
పోలీస్ కమిషనర్‌కు లేఖ
త్రీటౌన్ పోలీసుల విచారణ
ఏయూలో దళిత పరిశోధకుడిపై
స్పందించిన
జాతీయ ఎస్సీ కమిషన్
ఈ దారుణ వ్యవహారాన్ని సుమోటోగా స్వీకరించిన జాతీయ ఎస్సీ కమిషన్.. ఏడు రోజుల్లోగా పూర్తి వివరాలతో వివరణ ఇవ్వాలని వీసీ రాజశేఖర్‌కు కస్టమ్ నోటీసు జారీ చేసింది. అయినప్పటికీ వర్సిటీ నుంచి సరైన స్పందన రాకపోవడంతో.. కమిషన్ తాజాగా ‘అత్యవసర’ రిమైండర్‌ను పంపింది. ఇంకా నిర్లక్ష్యం వహిస్తే భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 338 ప్రకారం కమిషన్‌కు ఉన్న సివిల్ కోర్టు సమానమైన అధికారాలను ప్రయోగించి కఠిన చర్యలు తీసుకుంటామని గట్టిగా హెచ్చరించింది.
మద్దిలపాలెం: జాతీయ స్థాయిలో ఘన చరిత కలిగిన విశ్వవిద్యాలయంగా వెలుగొందుతున్న ఆంధ్ర విశ్వవిద్యాలయం ఇప్పుడు వివాదాలకు కేంద్ర బిందువుగా మారుతోంది. వర్సిటీ ఉన్నతాధికారుల అనుచిత వైఖరి, మొండితనం కారణంగా జాతీయ స్థాయిలో తలదించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. బాబాసాహెబ్ డా.బీఆర్ అంబేడ్కర్ పేరుతో నడుస్తున్న ప్రతిష్టాత్మక పీఠం(చైర్)లోనే ఒక దళిత పరిశోధక విద్యార్థికి ఘోర అవమానం ఎదురైంది. ‘జాతీయ ఎస్సీ కమిషన్’ఆదేశాలను సైతం వర్సిటీ ఉన్నతాధికారులు బేఖాతరు చేయడం చర్చనీయాంశమైంది. కేంద్ర సామాజిక న్యాయం, సాధికారత మంత్రిత్వ శాఖతో పాటు డాక్టర్ అంబేడ్కర్ ఫౌండేషన్ ఇచ్చిన స్పష్టమైన ఉత్తర్వులను సైతం తుంగలో తొక్కుతూ ఒక మేధావిని మానసికంగా కుంగదీస్తున్న వైనంపై జాతీయ కమిషన్ ఇప్పుడు నేరుగా రంగంలోకి దిగింది.
ఫెలోషిప్ నిలిపివేత..
వీసీ, డీన్‌లపై వేధింపుల ఆరోపణలు
ఆంధ్ర విశ్వవిద్యాలయంలోని డాక్టర్ బి.ఆర్.అంబేడ్కర్ పీఠం కింద డాక్టరల్ ఫెలోగా అత్యున్నత పరిశోధన చేస్తున్న యాడాల ప్రవీణ్‌కుమార్ ఏడాది కాలంగా నరకయాతన అనుభవిస్తున్నారు. బాధితుడు జాతీయ ఎస్సీ కమిషన్‌కు సమర్పించిన లిఖితపూర్వక ఫిర్యాదు ప్రకారం.. వర్సిటీ వీసీ ప్రొఫెసర్ జీపీ రాజశేఖర్, ఆర్ అండ్ డీ డీన్‌లు తనను పదేపదే వివక్షకు గురిచేస్తున్నారు. పరిశోధనకు సంబంధించిన ఫెలోషిప్ సొమ్మును ఉద్దేశపూర్వకంగా నిలిపివేస్తూ, ఆర్థికంగా దెబ్బతీస్తూ తీవ్ర మానసిక క్షోభకు గురిచేస్తున్నారని బాధితుడు కన్నీటిపర్యంతమయ్యాడు.
కన్నతల్లిని కోల్పోయినా కరగని మానవత్వం
తనకు జరుగుతున్న అన్యాయాన్ని వివరించుకునేందుకు వీసీ కార్యాలయానికి పదేపదే తిరిగినా ప్రవీణ్‌ను కనీసం గదిలోకి కూడా రానివ్వలేదు. చివరకు వీసీ కారు ఎక్కి వెళ్తుండగా.. పరుగున వెళ్లి వేడుకున్నా కనీస మానవతా దృక్పథం చూపకపోగా, ‘అంబేడ్కర్ చైర్‌ను మూసేస్తాం, నిన్ను యూనివర్సిటీలో లేకుండా చేస్తాం’అంటూ చిన్నచూపు చూస్తూ మాట్లాడారని బాధితుడు ఆవేదన వ్యక్తం చేశాడు.
ఒకవైపు తీవ్రమైన ఆర్థిక ఇబ్బందులు, మరోవైపు కన్నతల్లి ప్రాణాపాయ స్థితిలో ఉందన్న విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లినా అధికారుల మనసు కరగలేదు. చివరకు వర్సిటీ అధికారులు పెట్టిన మానసిక వేదనను భరిస్తూనే, తల్లికి సరైన వైద్యం అందించలేక ప్రవీణ్‌కుమార్ తన తల్లిని కోల్పోవాల్సి వచ్చింది.
సీపీకి ఎస్సీ కమిషన్ లేఖ
మరోవైపు ఈ ఘటనపై అట్రాసిటీల నిరోధక చట్టం కింద తక్షణమే కేసు నమోదు చేసేలా చట్టపరమైన చర్యలు చేపట్టాలని నగర పోలీస్ కమిషనర్‌కు జాతీయ ఎస్సీ కమిషన్ ప్రత్యేకంగా లేఖ రాసింది. ఈ ఆదేశాల నేపథ్యంలో నగర పోలీసులు రంగంలోకి దిగి, ఈ వేధింపుల ఆరోపణలపై అధికారికంగా దర్యాప్తు ప్రారంభించడంతో ఏయూ వర్గాల్లో వణుకు మొదలైంది.
బాబాసాహెబ్ సందేశమే నన్ను బతికించింది: ప్రవీణ్ కుమార్
‘వర్సిటీ అధికారులు పెట్టిన మానసిక వేధింపులను తట్టుకోలేక, ఒక దశలో ప్రాణాలు తీసుకోవాలని కూడా అనుకున్నాను. కానీ హక్కుల కోసం పోరాడాలి, ఉద్యమించాలి అన్న బాబాసాహెబ్ అంబేడ్కర్ సందేశం నన్ను బతికించింది. ధైర్యాన్ని కూడగట్టుకుని, అన్ని ఆధారాలతో జాతీయ కమిషన్‌ను ఆశ్రయించాను’అని ప్రవీణ్‌కుమార్ పేర్కొన్నారు.


