పాడేరు: ఉత్తరాంధ్ర ప్రజల ఆరాధ్యదైవం పాడేరు శ్రీ మోదకొండమ్మ అమ్మవారి రాష్ట్ర గిరిజన జాతర సందర్భంగా ముద్రించిన సాంస్కృతిక పోస్టర్లు ఇప్పుడు స్థానికంగా తీవ్ర దుమారం రేపుతున్నాయి. ఉత్సవ కమిటీ అధ్యక్షురాలు గిడ్డి ఈశ్వరి ప్రొటోకాల్‌ను తుంగలో తొక్కి, ఏకపక్షంగా వ్యవహరించారని వైఎస్సార్‌సీపీ, బీజేపీ శ్రేణులతో పాటు సామాన్య భక్తులు మండిపడుతున్నారు.
ఎమ్మెల్యే ఫొటో లేకపోవడంపై విమర్శలు
సాధారణంగా స్థానిక ఎమ్మెల్యే ఎవరు ఉంటే వారే అమ్మవారి ఆలయానికి ఐదేళ్ల పాటు చైర్మన్‌గా వ్యవహరిస్తారు. జాతర ఉత్సవాల గోడ పత్రికలలో ప్రొటోకాల్ ప్రకారం స్థానిక ఎమ్మెల్యే, ఆలయ కమిటీ చైర్మన్ ఫొటోను ముద్రించడం ఆనవాయితీ. అయితే, ఈ ఏడాది ఉత్సవ కమిటీ అధ్యక్షురాలిగా ఉన్న గిడ్డి ఈశ్వరి.. రాజకీయ కక్షతో ప్రస్తుత ఎమ్మెల్యే, ఆలయ కమిటీ చైర్మన్ మత్స్యరాస విశ్వేశ్వరరాజు ఫొటోను ముద్రించలేదని స్థానికులు ఆరోపిస్తున్నారు. చంద్రబాబు, లోకేష్, పవన్ కళ్యాణ్, సంధ్యారాణిల ఫొటోలతో పాటు తన ఫోటోను పెద్దదిగా ముద్రించి, స్థానిక ఎమ్మెల్యేను విస్మరించడంపై భక్తులు తప్పుపడుతున్నారు. పోస్టర్లలో దేశ ప్రధాని నరేంద్ర మోదీ ఫోటో లేకపోవడంపై బీజేపీ జిల్లా అధ్యక్షురాలు మఠం శాంతికుమారి, బీజేపీ గిరిజన మోర్చా రాష్ట్ర అధ్యక్షులు పాంగి రాజారావు తీవ్రంగా స్పందించారు. శుక్రవారం వారు విలేకరులతో మాట్లాడుతూ.. కూటమి ప్రభుత్వంలో తాము కూడా భాగస్వాములమనే విషయాన్ని ఉత్సవ కమిటీ అధ్యక్షురాలు మరచిపోయారా అని ప్రశ్నించారు. ముఖ్యమంత్రి, డిప్యూటీ సీఎం, రాష్ట్ర మంత్రుల ఫొటోలు ముద్రించి.. ప్రధాని నరేంద్ర మోదీ, స్థానిక ఎమ్మెల్యే విశ్వేశ్వరరాజు ఫొటోలను విస్మరించడం వెనుక ఉన్న ఆంతర్యమేమిటని నిలదీశారు. ఇలాంటి ఏకపక్ష నిర్ణయాల వల్ల జాతరను ప్రశాంతంగా నిర్వహించలేరని హితవు పలికారు. ఈ విషయాన్ని తమ పార్టీ అధిష్టానం దృష్టికి తీసుకువెళ్తామని స్పష్టం చేశారు. ఈ సమావేశంలో బీజేపీ నాయకులు రవికుమార్, పాపిడిరాజు, సల్లా రామకృష్ణ, ఉమామహేష్ తదితరులు పాల్గొన్నారు.
ఎమ్మెల్యే, ఆలయ కమిటీ చైర్మన్
విశ్వేశ్వరరాజుకు దక్కని గౌరవం
కనిపించని ఫొటో
ప్రధాని మోదీ ఫొటో లేకపోవడంపై
బీజేపీ నేతల అభ్యంతరం
ఉత్సవ కమిటీ అధ్యక్షురాలు
గిడ్డి ఈశ్వరి ఏకపక్ష నిర్ణయం
ఆమె తీరుపై భక్తుల మండిపాటు


