అనకాపల్లి : ఏజెన్సీ ప్రాంతం నుంచి అనకాపల్లి జిల్లా బుచ్చియ్యపేట, జాతీయ రహదారి మీదుగా కారులో తరలిస్తున్న 194 కేజీల గంజాయితో పాటు(వీటి విలువ సుమారుగా రూ.97లక్షలు) కారు, ముగ్గురు వ్యక్తులు, మూడు సెల్‌ఫోన్లు, ఒక బైక్ స్వాదీనం చేసుకున్నట్లు ఎస్పీ తుహిన్ సిన్హా చెప్పారు. తమ కార్యాలయంలో మంగళవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. గంజాయి రవాణాపై జిల్లాలో వివిధ ప్రాంతాల్లో ప్రత్యేక చెక్‌పోస్టులను ఏర్పాటు చేసినప్పటికీ, గంజాయి స్మగ్లర్లు ప్రత్యేక మార్గాల్లో రవాణా చేయడం జరుగుతుందని, గత ఏడాది కంటే ఈ ఏడాది గంజాయి(డ్రైయి) రవాణా తగ్గినప్పటికీ హషీష్ అయిల్ పెరిగిందన్నారు. ఈనెల 11న జిల్లాలో బుచ్చియ్యపేట పోలీస్‌స్టేషన్ పరిధిలో ఈగిల్ టీమ్, స్పెషల్ బ్రాంచ్ పర్యవేక్షణలో అజ్ఞాత వ్యక్తులు ఇచ్చిన సమాచారం మేరకు బుచ్చియ్యపేట పోలీసులు బంగారుమెట్ట–అనకాపల్లి రోడ్డులోని గొన్నవానిపాలెం జంక్షన్ వద్ద వాహనాలు తనిఖీ చేపట్టామన్నారు. గంజాయితో వెళుతున్న కారుకు రూట్ మ్యాప్ ద్వారా వెళుతున్న సమయంలో బైక్‌ను నడుపుతున్న వ్యక్తిని పట్టుకుని ప్రశ్నించగా, వెనుక కారులో 194 కిలోల గంజాయితో పాటు ఇద్దరు వ్యక్తులు పటుబడ్డారని తెలిపారు. చీడికాడ మండలం బైలపూడి గ్రామానికి చెందిన గుమ్మాల పేరునాయుడు (గతంలో 6 కేసులు), అల్లూరి జిల్లా పెదబయలు మండలం, గజ్జేడు గ్రామానికి చెందిన మండిపల్లి సత్తిబాబు(గంజాయి సాగుదారు), చీడికాడ మండలం బైలపూడి గ్రామానికి చెందిన గొల్లవిల్లి గణేష్(కారు డ్రైవర్)ను పట్టుకోవడం జరిగిందని తెలిపారు.
ఈ కేసులో మరో ఇద్దరు నిందుతుల కోసం గాలిస్తున్నామన్నారు. జిల్లాలో ఎక్కడైనా గంజాయి, డ్రగ్స్ పట్ల జీరో టాలరెన్స్ పాలసీని అనుసరిస్తున్నామని ఎస్పీ చెప్పారు. ఎక్కడైనా గంజాయి వినియోగిస్తున్నా, విక్రయిస్తున్నా తక్షణమే 112 లేదా 1972 టోల్ ఫ్రీ నంబర్లకు సమాచారం అందించాలని కోరారు. సమాచారం ఇచ్చిన వారి వివరాలు గోప్యంగా ఉంచడం జరుగుతుందన్నారు. రెండేళ్లలో జిల్లాలో గంజాయి రవాణా గణనీయంగా తగ్గిందని, ఈ ఏడాది ఇప్పటి వరకూ 46 కేసులు నమోదు చేసి, మొత్తం 1,177 కేజీల గంజాయిని సీజ్ చేయడం జరిగిందన్నారు. 7.14 లీటర్ల హషీష్ ఆయిల్ స్వాధీనం చేసుకున్నామన్నారు. ప్రాసిక్యూషన్ విభాగంతో సమన్వయం ద్వారా ఈ ఏడాది 13 కేసుల్లో 24 మందికి శిక్షలు పడేలా చేశామని, ఇందులో 16 మందికి 10 నుండి 15 ఏళ్ల జైలు శిక్ష పడిందన్నారు. ఎన్‌డీపీఎస్ కేసుల్లో ఫైనాన్షియల్ ఇన్వెస్టిగేషన్ ద్వారా నేటి వరకూ రూ.1.25 కోట్ల విలువైన ఆస్తులను సీజ్ చేశామని పేర్కొన్నారు. కార్యక్రమంలో డీఎస్పీ ఎం.శ్రావణి, కొత్తకోట సీఐ జి.కోటేశ్వరరావు, కొత్తకోట ఎస్‌ఐ ఎం.శ్రీనివాస్, బుచ్చయ్యపేట ఎస్‌ఐ ఎ.శ్రీనివాసరావు పాల్గొన్నారు.
బుచ్చెయ్యపేట ఎస్‌ఐకు ఎస్పీ అభినందన
బుచ్చెయ్యపేట: స్థానిక ఎస్‌ఐ శ్రీనివాసరావును ఎస్పీ తుహిన్ సిన్హా మంగళవారం అభినందించారు. బుచ్చెయ్యపేట రోడ్డులో సుమారు రూ.కోటి విలువ గల సుమారు 194 కిలోల గంజాయి, స్మగ్లర్‌లను చౌకచక్యంగా పట్టుకోవడంతో ఎస్‌ఐని సత్కరించారు.ఎస్‌ఐతో పాటు బుచ్చెయ్యపేట పోలీస్‌స్టేషన్ సిబ్బందిని ఎస్పీ అభినందించారు.


