మాయమాటలతో పసిబిడ్డ అపహరణ | - | Sakshi
Sakshi News home page

మాయమాటలతో పసిబిడ్డ అపహరణ

May 15 2026 10:20 AM | Updated on May 15 2026 10:20 AM

● సీసీ కెమెరాల ఆధారంగా వెంటాడి పట్టుకున్న పోలీసులు ● పాడేరులో మెరుపు ఆపరేషన్‌

పాడేరు: వైద్య చికిత్స కోసం జిల్లా ఆసుపత్రికి తీసుకువచ్చిన నెలన్నర బాబును ఓ గుర్తు తెలియని మహిళ మాయమాటలు చెప్పి అపహరించిన ఘటనను పోలీసులు అత్యంత చాకచక్యంగా గంటల వ్యవధిలోనే ఛేదించారు. పాడేరు సీఐ డి. దీనబంధు తెలిపిన వివరాల ప్రకారం.. పాడేరు మండలం, సలుగు పంచాయతీ, బూరుగుచెట్టు గ్రామానికి చెందిన పాంగి రామారావు, కాంతమ్మ దంపతుల నెలన్నర బాబు అనారోగ్యానికి గురవ్వడంతో, గురువారం వారు పాడేరు జిల్లా ఆసుపత్రికి తీసుకువచ్చారు. అక్కడ ఓ గుర్తు తెలియని మహిళ మాయమాటలు చెప్పి, బాబును ఎత్తుకుంటానని వారిని నమ్మించింది. వారిని మాటల్లో పెట్టి, అదును చూసి బాబుతో సహా అక్కడి నుంచి పరారైంది. ఈ విషయం తెలుసుకున్న వెంటనే బాబు తల్లిదండ్రులు పోలీసులకు సమాచారం అందించారు. దీనిపై తక్షణమే స్పందించిన పాడేరు సీఐ దీనబంధు, హుకుంపేట సీఐ విజయ్‌కుమార్‌, ఎస్‌ఐ విజయ్‌కుమార్‌ తమ సిబ్బందితో కలిసి రెండు బృందాలుగా ఏర్పడ్డారు. జిల్లా ఆసుపత్రితో పాటు పరిసర ప్రాంతాల్లోని సీసీ కెమెరాలను నిశితంగా పరిశీలించారు. పలు ప్రాంతాల్లో ముమ్మరంగా వాహన తనిఖీలు చేపట్టారు. సదరు మహిళ బిడ్డను ఎత్తుకొని హుకుంపేట మార్గంలో వెళ్తున్నట్లు గుర్తించారు. కొంతిలి సమీపంలో నిందితురాలిని అదుపులోకి తీసుకున్న పోలీసులు, బాబును సురక్షితంగా స్వాధీనం చేసుకున్నారు. అనంతరం జిల్లా ఆసుపత్రిలో తల్లిదండ్రులకు బాబును అప్పగించారు. బాబును అపహరించిన మహిళ హుకుంపేట మండలం, ఉప్ప గ్రామానికి చెందిన సంతరి కృష్ణవేణి (భర్త దామోదర్‌) గా పోలీసులు గుర్తించి అరెస్ట్‌ చేశారు. తల్లిదండ్రులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు సీఐ దీనబంధు తెలిపారు. తమ బిడ్డను గంటల వ్యవధిలోనే ప్రాణాలతో తిరిగి అప్పగించిన పోలీసులకు తల్లిదండ్రులు కన్నీటి పర్యంతమై కృతజ్ఞతలు తెలిపారు.

Advertisement
 
Advertisement
Advertisement