కన్నీట్‌ సుడులు | - | Sakshi
Sakshi News home page

కన్నీట్‌ సుడులు

May 13 2026 12:56 AM | Updated on May 13 2026 12:56 AM

రెండేళ్ల కష్టం.. ఎన్నో ఆశలు.. ఒక వైద్య సీటు కోసం జీవితాన్నే పుస్తకాలకే అంకితం చేసిన లక్షలాది విద్యార్థుల కలలను నీట్‌ రద్దు నిర్ణయం ఒక్కసారిగా ఛిద్రం చేసింది.ప్రశ్నపత్రం లీక్‌ వ్యవహారం దేశాన్ని కుదిపేస్తుండగా.. మళ్లీ పరీక్ష రాయాల్సిన పరిస్థితి విద్యార్థులను తీవ్ర మానసిక ఆందోళనలోకి నెట్టేసింది.

నీట్‌ రద్దుతో విద్యార్థుల కన్నీటి పర్యంతం

ప్రభుత్వ నిర్లక్ష్యంపై తల్లిదండ్రుల ఆగ్రహం

రెండేళ్ల శ్రమ బుగ్గిపాలేనని ఆవేదన

సాక్షి, విశాఖపట్నం/మద్దిలపాలెం : వైద్యుడై సమాజానికి సేవ చేయాలని, తెల్లకోటు వేసుకుని స్టెతస్కోప్‌తో రోగి నాడి పట్టుకోవాలని.. లక్షలాది మంది విద్యార్థులు రెండేళ్లుగా కంటిమీద కునుకు లేకుండా శ్రమించారు. మే 3వ తేదీన పరీక్ష రాసి బయటకు వచ్చేటప్పుడు, వారి కళ్లలో ఒక రకమైన సంతృప్తి.. ’అమ్మా, నాన్నా.. నేను డాక్టర్‌ అవుతాను’ అన్న ధీమా. కానీ, ఆ సంతోషం చిటికెలో ఆవిరైపోయింది. కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నీట్‌ యూజీ 2026 రద్దు నిర్ణయం, లక్షలాది మంది విద్యార్థుల గుండెల్లో గునపమై దిగినట్టయింది.

ప్రతిభావంతులు బలి

రాజస్థాన్‌లో వెలుగు చూసిన ’పేపర్‌ లీక్‌’ ఉదంతం దేశవ్యాప్తంగా విద్యా వ్యవస్థ పునాదులను కదిలించింది. పరీక్షల పారదర్శకతను కాపాడేందుకు కేంద్రం ఈ కేసును సీబీఐకి అప్పగించడం, పరీక్షను రద్దు చేయడం సరైన నిర్ణయమే కావచ్చు. కానీ, అక్రమాలకు పాల్పడిన కొందరు స్వార్థపరుల వల్ల, రాత్రింబవళ్లు కష్టపడి చదివిన లక్షలాది మంది సాధారణ విద్యార్థులు ఇప్పుడు అనిశ్చితిలో పడిపోయారు.

ఆగిపోయిన కల.. ఆవిరైన శ్రమ

చిన్న చిన్న గదుల్లో బందీలై, పుస్తకాలే ప్రపంచంగా బతికిన విద్యార్థుల ఆవేదన వర్ణనాతీతం. ‘రెండేళ్ల శ్రమ.. వేల గంటల సాధన.. అంతా ఒక్క నిర్ణయంతో బూడిదలో పోసిన పన్నీరైంది. మళ్లీ అదే ఏకాగ్రతతో పుస్తకాలు పట్టగలమా? ఆ ఉత్సాహం మళ్లీ వస్తుందా?’ అని విద్యార్థులు కన్నీటి పర్యంతమవుతున్నారు. తల్లిదండ్రుల పరిస్థితి మరింత దయనీయం. తమ పిల్లల చదువు కోసం రెక్కల కష్టం ధారబోసి, కోచింగ్‌ సెంటర్లకు రూ.లక్షలు కుమ్మరించిన వారు, ఇప్పుడు తమ బిడ్డల నిరాశను చూసి తట్టుకోలేకపోతున్నారు. కొంతమంది విద్యార్థులు కన్నీళ్లు పెట్టుకుంటుండగాం తల్లిదండ్రులు వారిని ఓదార్చలేని పరిస్థితి నెలకొంది.

మా తప్పేంటి?

నిజాయితీగా చదివి, కష్టపడి పరీక్ష రాసిన లక్షలాది మంది విద్యార్థులు ఇప్పుడు మళ్లీ అదే ఒత్తిడిని భరించాల్సి వస్తోంది. ఒకరి అక్రమంం లక్షల మందికి శిక్షగా మారిందనే భావన విద్యార్థుల్లో కనిపిస్తోంది. ‘మళ్లీ చదవాలి.. మళ్లీ ఒత్తిడి భరించాలి.. మళ్లీ పరీక్ష హాల్లో కూర్చోవాలి’.. అనే ఆలోచన వారిని మానసికంగా అలసటకు గురిచేస్తోంది.

ఎన్టీఏ భరోసా సరిపోతుందా?

రీ–ఎగ్జామ్‌ కోసం కొత్తగా దరఖాస్తు చేయక్కర్లేదని, ఫీజు కట్టనవసరం లేదని నేషనల్‌ టెస్టింగ్‌ ఏజెన్సీ చెబుతోంది. కానీ, విద్యార్థులకు కావాల్సింది ఆర్థిక వెసులుబాటు కాదు, మానసిక స్థైర్యం. ఒకసారి రాసిన పరీక్షను, అది కూడా లీకేజీ మరకల మధ్య మళ్లీ రాయాల్సి రావడం అంటే, ప్రతిభావంతులైన విద్యార్థుల ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీయడమే.

వ్యవస్థ మారేది ఎప్పుడు?

ఒక పేపర్‌ లీక్‌.. ఒక రద్దు.. వేలాది మంది విద్యార్థుల కన్నీళ్లు. ప్రతి ఏటా ఏదో ఒక రూపంలో విద్యార్థుల భవిష్యత్తుతో చెలగాటం ఆడుతున్న అక్రమార్కులకు కఠిన శిక్ష పడాల్సిందే. ఈ రద్దు నిర్ణయం వ్యవస్థను ప్రక్షాళన చేస్తుందేమో కానీ, విద్యార్థుల మనసులకు తగిలిన గాయాన్ని మాత్రం అంత సులభంగా మాన్పలేదు. కొత్త షెడ్యూల్‌ రావచ్చు.. కొత్త హాల్‌ టికెట్లు జారీ అవ్వొచ్చు.. కానీ, పోగొట్టుకున్న సమయాన్ని, మానసిక ప్రశాంతతను మళ్లీ తెచ్చి ఇచ్చేది ఎవరు?

దోషులపై కఠిన చర్యలు తీసుకోవాలి

మే నెల 3న జరిగిన నీట్‌ పరీక్ష లీకేజీతో రద్దు అయినట్టు వార్తల్లో చూశాం. నీట్‌ పరీక్షలో వచ్చిన ప్రశ్నలను పోలిన సుమారు 140 ప్రశ్నలతో ఉన్న ఓ ప్రాక్టీస్‌ పేపర్‌ సోషల్‌ మీడియాలో లీకై ందంటే ప్రభుత్వాలు ఎంత నిర్లక్ష్యంగా ఉన్నాయో అర్ధమవుతుంది. అధికారులు సమగ్ర దర్యాప్తు చేపట్టాలి. ఈ పేపర్‌ లీకేజీ వెనక ఎవరున్నా..వారిపై చట్ట పరమైన చర్యలు తీసుకోవాలి.

– గిరిజారాణి, నీట్‌ విద్యార్థిని తల్లి

Advertisement
 
Advertisement
Advertisement