మోదమ్మ జాతరలో కూటమి రాజకీయం | - | Sakshi
Sakshi News home page

మోదమ్మ జాతరలో కూటమి రాజకీయం

May 17 2026 12:42 AM | Updated on May 17 2026 12:42 AM

పండగ తేదీల మార్పు..

గిరిజన సంప్రదాయాలపై దాడే!

వైఎస్సార్‌సీపీ నేతల మండిపాటు

డుంబ్రిగుడ: ఉత్తరాంధ్ర ప్రజల ఆరాధ్యదైవం, గిరిజనుల ఇలవేల్పు శ్రీ మోదకొండమ్మ తల్లి రాష్ట్ర గిరిజన జాతరను సైతం కూటమి ప్రభుత్వం తన రాజకీయ అవసరాలకు వేదికగా మార్చుకోవడం దారుణమని వైఎస్సార్‌సీపీ మండల అధ్యక్షుడు పాంగి పరశురామ్‌, వైస్‌ ఎంపీపీ శెట్టి ఆనంద్‌రావు మండిపడ్డారు. శనివారం ఎమ్మెల్యే రేగం మత్స్యలింగం క్యాంపు కార్యాలయంలో డుంబ్రిగుడ మండల నాయకులు ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. ఆలయ కమిటీ చైర్మన్‌, సభ్యులు, గ్రామ పెద్దలు, గిరిజన సంఘాలతో పాటు అన్ని పక్షాలు కలిసి ఏకగ్రీవంగా నిర్ణయించిన మోదకొండమ్మ జాతర తేదీలను.. కూటమి నేతలు తమ వ్యక్తిగత, రాజకీయ అవసరాల కోసం మార్చడం గిరిజన సంప్రదాయాలపై దాడి చేయడమేనని విమర్శించారు. టీడీపీ నేత వివాహ వేడుకకు మంత్రి నారా లోకేష్‌ రానున్న నేపథ్యంలో.. ఆయన పర్యటనకు వీలుగా ఇన్‌చార్జ్‌ మంత్రి సంధ్యారాణి, టీడీపీ పాడేరు ఇన్‌చారిర్జ గిడ్డి ఈశ్వరి కలెక్టర్‌ కార్యాలయంపై ఒత్తిడి తెచ్చి, జాతర తేదీలను ఏకపక్షంగా మార్పించారని ఆరోపించారు.

పోస్టర్లలో ప్రొటోకాల్‌ ఎక్కడ?

ఇంతటితో ఆగకుండా జాతరకు సంబంధించిన అధికారిక, సాంస్కృతిక పోస్టర్లలో కూడా కూటమి నాయకులు రాజకీయ కక్షసాధింపు చర్యలకు దిగారని నాయకులు ధ్వజమెత్తారు. పాడేరులో స్థానిక ఎమ్మెల్యేనే ఆలయ కమిటీ చైర్మన్‌గా వ్యవహరిస్తారని, ఆ హోదాలో ఉన్న ఎమ్మెల్యే మత్స్యరాస విశ్వేశ్వరరాజు ఫొటోతో పాటు జిల్లాలో ప్రజలచే ఎన్నుకోబడిన ప్రజాప్రతినిధుల పొటోలను ప్రొటోకాల్‌ ప్రకారం పోస్టర్లలో ముద్రించడం ఆనవాయితీ అని గుర్తుచేశారు. కానీ, గిడ్డి ఈశ్వరి రాజకీయ ద్వేషంతో ప్రస్తుత ఎమ్మెల్యే, జిల్లా ప్రజాప్రతినిధుల ఫొటోలు ఎక్కడా లేకుండా చేసి.. చంద్రబాబు, లోకేష్‌, పవన్‌ కళ్యాణ్‌, సంధ్యారాణి ఫొటోలతో పాటు తన పొటోను పెద్దదిగా ముద్రించుకున్నారని విమర్శించారు. ఇది రాష్ట్ర గిరిజన జాతరలా ఉందా? లేక టీడీపీ కూటమి జాతరలా ఉందా? అనే అనుమానాలు ప్రజల్లో కలుగుతున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. కూటమి నాయకులు చేస్తున్న కుట్రలను మన్యం ప్రజలు నిశితంగా గమనిస్తున్నారని, రానున్న రోజుల్లో వారే తగిన గుణపాఠం చెబుతారని హెచ్చరించారు. ఈ సమావేశంలో గుంటసీమ, లైగండ ఎంపీటీసీలు గోపాల్‌ రావు, బి. రామరావు, తుమ్నాథ్‌, అర్జున్‌, నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement