పుష్కరాలకు పార్కింగ్ స్థలాల గుర్తింపు
ఏటూరునాగారం: వచ్చే ఏడాలో జరగనున్న గోదావరి పుష్కరాలకు వచ్చే భక్తుల వాహనాలను నిలిపించేదుకు ప్రత్యేకంగా నాలుగు చోట్ల పార్కింగ్ స్థలాలను అధికారులు గుర్తించారు. ఈ మేరకు ఐటీడీఏ ఇంజనీరింగ్‌శాఖ ద్వారా పార్కింగ్ స్థలాలను అభివృద్ధి చేసేందుకు, లెవలింగ్, విద్యుత్ దీపాలు ఇతర పనుల కోసం ఐటీడీఏ ఇంజనీరింగ్ శాఖ అధికారులు రూ. 5.21 కోట్లతో ప్రతిపాదలను కలెక్టర్ దివాకరకు గురువారం అందజేశారు. నిధులు మంజూరు చేస్తే వాటితో పార్కింగ్ స్థలాలకు కావాల్సిన పనులు చేపట్టనున్నట్లు అధికారులు వెల్లడించారు. ప్రభుత్వం నుంచి అనుమతులు వస్తే గానీ ఇక్కడ పనులు మొదలయ్యే అవకాశం లేదని అధికారులు చెబుతున్నారు. అంతేకాకుండా పార్కింగ్ స్థలాలను ఏటూరునాగారం మండల పరిధిలోని రామన్నగూడెం, మంగపేట పుష్కరఘాట్లు, వెంకటాపురం(కె) వైపు ఒకటి, ముళ్లకట్ట వద్ద మరొకటి ఏర్పాటు చేయనున్నట్లు వివరించారు.
ఏటూరునాగారం: ఉన్నత విద్యా పాఠశాలల్లో పనిచేస్తున్న స్కావెంజర్ల వేతనాలు, మధ్యాహ్న భోజన కార్మికుల పెండింగ్ బిల్లులను వెంటనే చెల్లించాలని ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి జంపాల రవీందర్ అన్నారు. ఈ మేరకు మండల కేంద్రంలో గురువారం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. పాఠశాలల్లో విద్యార్థులకు అల్పాహారం కింద బిల్లులు చెల్లించాల్సి ఉండగా ఇప్పటి వరకు చెల్లించలేదన్నారు. ఏడాదిగా చెల్లించకున్నా వాటి గురించి పట్టించుకోలేదని విమర్శించారు. స్కావెంజర్లలకు సరైన వేతనాలు ఇవ్వకుండా వెట్టిచాకిరి చేయించుకుంటున్నారని తెలిపారు. మధ్యాహ్న భోజన కార్మికులకు పెరిగిన ధరలకు అనుగుణంగా బిల్లులు ఇవ్వాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో ఏఐటీయూసీ మండల అధ్యక్షుడు చాంద్‌పాషా, ఉపాధ్యక్షుడు కొమురయ్య, ప్రమీల, కార్మికులు పాల్గొన్నారు.
రేగొండ: భక్తుల కొంగుబంగారంగా విరజిల్లుతున్న కొడవటంచ శ్రీ లక్ష్మీనరసింహ స్వామి బ్రహ్మోత్సవాలు గురువారం ఉదయం అభిషేకంతో మొదలయ్యాయి. అనంతరం స్వామి వారిని సూర్యవాహన సేవలో మాడ వీధుల గుండా ఊరేగించారు. ఈ సేవలో ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. సాయంత్రం స్వస్తివాచనం అనంతరం శేషవాహనసేవ, అంకురారోహనం కార్యక్రమాలు కొనసాగాయి. జాతర మొదటి రోజు భక్తులు హాజరై మొక్కులు చెల్లించుకున్నారు. జాతరలో దేదీప్యమానంగా వెలుగొందేందుకు అధికారులు ఆలయాన్ని దీపాలంకరణ చేశారు.
నిత్య అన్నసత్రం ప్రారంభం
వాసవి ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో నిర్వహించే నిత్య అన్న సత్రాన్ని ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఆ సంఘం అధ్యక్షుడు కాసం నాగరాజు, గౌరవ అధ్యక్షుడు ఎర్రం సదాశివ శంకర్, సభ్యులు పాల్గొన్నారు.
రేగొండ: అక్రమంగా తరలిస్తున్న పీడీఎస్ బియ్యాన్ని టాస్క్‌ఫోర్స్, సివిల్ సప్లయీస్ అధికారులు గురువారం ఉదయం పట్టుకున్నారు. హనుమకొండ జిల్లా అంబాల నుంచి మహారాష్ట్రకు అక్రమంగా పీడీఎస్ బియ్యం తరలిస్తున్నారనే సమాచారం మేరకు మండలంలోని భాగిర్థిపేట జంక్షన్ వద్ద టాస్క్‌ఫోర్స్ ఏసీపీ ప్రభాకర్ తన సిబ్బందితో కలిసి వాహనాలను తనిఖీ చేశారు. టాటా ఏస్ వాహనంలో బియ్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. సివిల్ సప్లయి ఆర్‌ఐ రాజు ఫిర్యాదు మేరకు డ్రైవర్ కృష్ణపై కేసు నమోదు చేసినట్లు ఎస్సై రాజేష్ తెలిపారు. పీడీఎస్ బియ్యాన్ని తరలిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
పుష్కరాలకు పార్కింగ్ స్థలాల గుర్తింపు


