రుణ లక్ష్యాలను అధిగమించాలి
ములుగు: బ్యాంకులకు నిర్ధేశించిన రుణ లక్ష్యాలను అధికారులు అధిగమించాలని అదనపు కలెక్టర్ సీహెచ్.మహేందర్‌జీ అన్నారు. కలెక్టరేట్‌లోని కాన్ఫరెన్స్ హాల్‌లో బ్యాంకర్ల జిల్లా సంప్రదింపుల కమిటీ, జిల్లాస్థాయి సమీక్ష సమావేశాన్ని గురువారం నిర్వహించారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ ప్రభుత్వ పథకాలకు ప్రాధాన్యత కల్పిస్తూ బ్యాంకర్లు ముందుకు సాగాలన్నారు. గ్రామాల్లో నిరుపేద కుటుంబాలకు బ్యాంకుల ద్వారా రుణాలు అందించి ఆర్థికంగా అభివృద్ధి చెందేందుకు సమావేశాలు నిర్వహించి అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని బ్యాంకర్లకు సూచించారు. నూతనంగా ఏర్పడే మహిళా సంఘాలకు బ్యాంకు లింకేజీ రుణాలను అందించడానికి నూతన ఖాతాలను తెరిపించాలని సంబంధిత అధికారులకు సూచించారు. అత్యంత ప్రతిష్టాత్మకంగా 60 ఏళ్లు నిండిన మహిళ వయోవృద్ధులతో ఏర్పాటు చేస్తున్న సంఘాలకు నూతన ఖాతాలు అందించడంతో పాటు రుణ సహాయం అందించడానికి బ్యాంకర్లు ముందుకు రావాలని కోరారు. నిరుద్యోగ యువతకు స్వయం ఉపాధి, చిన్న తరహా పరిశ్రమలు స్థాపించడానికి ప్రభుత్వ పథకాల ద్వారా దరఖాస్తు చేసుకున్న వారికి నియమ నిబంధనల ప్రకారం రుణాలు అందించే విధంగా చూడాలని పేర్కొన్నారు.అనంతరం లీడ్ బ్యాంకు మేనేజర్ జయప్రకాశ్, నాబార్డ్ ఏజీఎం చంద్రశేఖర్, ఆర్‌బీఐ ఏజీఎం యశ్వంత్ సాయి, యూనియన్ బ్యాంక్ డీజీఎం కమలాకర్‌లతో కలిసి వచ్చే ఏడాది ఆర్థిక సంవత్సర ప్రొటెక్షన్ లింక్డ్ క్రెడిట్ ప్లాన్ బుక్‌లను అదనపు కలెక్టర్ ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా పశుసంవర్థక శాఖ అధికారి కొమురయ్య, పరిశ్రమల శాఖ జీఎం సిద్ధార్థరెడ్డి, ఎస్సీ కార్పొరేషన్ ఈడీ ధర్మ నాయక్, మత్స్య సంవర్థక శాఖ అధికారి సాల్మన్ రాజు, జిల్లా వ్యవసాయ శాఖ అధికారి సురేష్ కుమార్, హర్టికల్చర్ అధికారి సంజీవరావు తదితరులు పాల్గొన్నారు.
అదనపు కలెక్టర్ మహేందర్‌జీ


