● కలెక్టర్ టీఎస్.దివాకర
● ఉదయాన్నే గ్రామాల్లో ఆకస్మిక పర్యటన
ములుగు/వెంకటాపురం(ఎం): రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రజా పాలన–ప్రగతి ప్రణాళిక కార్యక్రమాన్ని అధికారులు, ప్రజాప్రతినిధులు పకడ్బందీగా అమలు చేయాలని కలెక్టర్ టీఎస్.దివాకర అధికారులను ఆదేశించారు. ఈ మేరకు కలెక్టర్ మంగళవారం ఉదయాన్నే మండలంలో ఆకస్మికంగా పర్యటించారు. ప్రభుత్వం చేపట్టిన ప్రజాపాలన కార్యక్రమాన్ని పకడ్భందీగా అమలు చేయాలనే ధృడ సంకల్పంతోనే కలెక్టర్ ప్రగతిబాట పట్టి గ్రామాలను సందర్శించారని ప్రజలు చర్చించుకుంటున్నారు. మండల కేంద్రంతో పాటు నల్లగుంట, ఎల్లారెడ్డి పల్లె గ్రామాల్లో పర్యటించారు. పరిశుభ్రత కార్యక్రమాన్ని పరిశీలించి సంబంధిత అధికారులకు, ప్రజాప్రతినిదులకు సూచనలు చేశారు. ఆయా గ్రామాల్లో నిర్మాణ దశలో ఉన్న ఇందిరమ్మ ఇళ్లను పరిశీలించి లబ్ధిదారులతో మాట్లాడారు. త్వరితగతిన పూర్తి చేయాలని సూచించారు. నిర్మాణాలు చేపట్టని ఇళ్లను రద్దుచేసే అవకాశం ఉందన్నారు. అనంతరం బీసీ కాలనీ వద్ద నర్సరీని కలెక్టర్ పరిశీలించి మాట్లాడారు. ప్రజాపాలన– ప్రగతి ప్రణాళికలో పరిశుభ్రతకు ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తున్నట్లు తెలిపారు. ప్రజలు తమ ఇంటి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో హౌసింగ్ పీడీ సూర్యనారాయణ, తహసీల్దార్ గిరిబాబు, ఎంపీడీఓ రాజు, వెంకటాపురం(ఎం) గ్రామ సర్పంచ్ మామిడి శెట్టి సుగుణస్వామి, ఎల్లారెడ్డిపల్లె సర్పంచ్ భాషబోయిన పోశాలు, రామప్ప ఆలయ చైర్మన్ మిల్కూరి అయిలయ్య, ప్రజా ప్రతినిధులు, తదితరులు పాల్గొన్నారు.
2కే రన్ ప్రారంభం
జిల్లా కేంద్రంలో ములుగు పురపాలక సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన 2కే రన్‌ను కలెక్టర్ దివాకర ప్రారంభించారు. ప్రభుత్వ ఆస్పత్రి జంక్షన్ నుంచి చేపట్టిన 2కె రన్ బండారుపల్లి రోడ్డు మీదుగా జీవంతరావుపల్లి క్రాస్ నుంచి తిరిగి అక్కడి వరకే కొనసాగింది. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, ఆరోగ్య పరిరక్షణకు ఇలాంటి 2కే రన్ కార్యక్రమాలు ఉపయోగపడుతాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్‌పర్సన్ చింతనిప్పుల చంద్రకళ, కౌన్సిలర్లు పాల్గొన్నారు. అనంతరం వెంకటాపురం(ఎం)మండల కేంద్రంలోని ఇంటర్ పరీక్ష కేంద్రాన్ని కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. విద్యార్థులు పరీక్షలు రాస్తున్న తీరును నిశితంగా పరిశీలించారు. మాల్ ప్రాక్టీస్‌కి ఆస్కారం లేకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్, సంబంధిత శాఖ అధికారులు పాల్గొన్నారు.


