మండలాల వారీగా
డెత్ క్లెయిమ్స్ వివరాలు ఇలా..
ఆర్‌ఓఎఫ్‌ఆర్ పట్టాల కోసం మూడేళ్లుగా నిరీక్షణ
ఐటీడీఏకు వివరాలు పంపించాలి..
ఏటూరునాగారం: ఏజెన్సీలోని ఆర్‌ఓఎఫ్‌ఆర్(రికగ్నైజేషన్ ఆఫ్ ఫారెస్ట్ రైట్స్) పట్టాలు కలిగిన పలువురు గిరిజన రైతులు వివిధ కారణాలతో మృత్యువాతపడ్డారు. వారి వారసులకు అటవీహక్కుల పత్రాలు తమపేరుపైకి మార్పు చేయాలని మూడేళ్లుగా పడిగాపులు కాస్తున్నారు. బాధిత కుటుంబీకులు ఐటీడీఏ, ఆయా మండలాల రెవెన్యూ కార్యాలయాల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. కానీ రెవెన్యూ అధికారులు మాత్రం డెత్ క్లెయిమ్స్ రిపోర్ట్‌ను ఐటీడీఏలోని ఆర్‌ఓఎఫ్‌ఆర్ విభాగానికి అందించడం లేదు. దీంతో పట్టాల మార్పు కోసం గిరిజనులు పడరాని పాట్లు పడుతున్నారు.
పెండింగ్‌లో 412 మంది రైతుల వివరాలు
జిల్లాలోని 10 మండలాల్లో 12,434 మంది ఆర్‌ఓఎఫ్‌ఆర్ పట్టాలు కలిగి ఉన్నారు. అందులో ఇప్పటి వరకు మరణించిన వారు 450 మంది ఉన్నారు. ఇప్పటి వరకు 38 మందికి చెందిన గిరిజన రైతుల వివరాలు మాత్రమే ఐటీడీఏలోని ఆర్‌ఓఎఫ్‌ఆర్ విభాగానికి రావడంతో ఆయా రైతుల వారసులకు పట్టాలు చేశారు. ఇంకా 412 మంది రైతుల వివరాలు రెవెన్యూ కార్యాలయాల నుంచి ఐటీడీఏకు రావాల్సి ఉంది. ఇవి రాకపోవడంతో బాధిత రైతుల వారసులకు ఆర్‌ఓఎఫ్‌ఆర్ పట్టా మార్పిడి కాలేని పరిస్థితి నెలకొంది.
నష్టపోతున్న రైతులు
గత బీఆర్‌ఎస్ ప్రభుత్వ పాలనలో రైతు బంధు పథకం కింద రూ.10 వేలు రైతుకు పెట్టుబడి సాయం కింద జమ అయ్యేవి. ప్రస్తుత ప్రభుత్వం రైతుభరోసా పథకం కింద రూ. 12వేలు ఒక ఎకరానికి ఇస్తుంది. పట్టా కలిగిన రైతులు మరణించడంతో ప్రభుత్వం చెల్లిస్తున్న రైతు భరోసా రావడం లేదు. దీనివల్ల బాధిత రైతులు పెట్టుబడి సాయం కోల్పోతున్నారు. ఇదేకాకుండా ఏడాదికి రూ.6వేలు వచ్చే పీఎం కిసాన్ డబ్బులు, రైతుబీమా లాంటి అనేక పథకాలను రెవెన్యూ అధికారుల నిర్లక్ష్యం మూలంగా గిరిజన రైతులు కోల్పోతున్నారు. ఇప్పటికై నా జిల్లాలోని రెవెన్యూ అధికారులు తక్షణమే స్పందించి వారి పరిధిలో ఉన్న మరణించిన రైతుల వివరాలను ఐటీడీఏలోని ఆర్‌ఓఎఫ్‌ఆర్ విభాగానికి అందించాలని బాధితులు వేడుకుంటున్నారు.
మండలాలు మరణించిన ఐటీడీఏకు వచ్చిన పెండింగ్
వారి సంఖ్య వివరాలు
ఏటూరునాగారం 70 13 57
గోవిందరావుపేట 30 17 13
కన్నాయిగూడెం 49 0 49
మంగపేట 135 0 135
ములుగు 21 0 21
ఎస్‌ఎస్‌తాడ్వాయి 71 5 66
వెంకటాపురం(ఎం) 18 3 15
వెంకటాపురం(కె) 50 0 50
వాజేడు 6 0 6
రైతుల డెత్‌క్లెయిమ్స్ ఐటీడీఏకు
అందించని రెవెన్యూ అధికారులు
కార్యాలయాల చుట్టూ
బాధితుల ప్రదక్షిణలు
జిల్లాలోని మరణించిన గిరిజన రైతుల వివరాలను ఐటీడీఏలోని ఆర్‌ఓఎఫ్‌ఆర్ విభాగానికి పంపించాలి. రెవెన్యూ అధికారులు నిర్లక్ష్యంతో గిరిజన రైతులకు అందాల్సిన పథకాలు అందడం లేదు. దీనివల్ల రైతులు తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు. ఈ విషయంపై ఐటీడీఏ అధికారులు సైతం దృష్టి సారించి రైతుల సమస్యలు పరిష్కరించాలి.
– కాపుల సమ్మయ్య, రైతు, ఏటూరునాగారం


