ములుగు: వేసవికాలాన్ని దృష్టిలో పెట్టుకొని ప్రజలకు తాగునీటి సమస్య కలగకుండా తగిన చర్యలు తీసుకోవాలని కలెక్టర్ టీఎస్.దివాకర అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్‌లో ఆదనపు కలెక్టర్ సంపత్ రావు, డీఆర్‌డీఓ శ్రీనివాస్‌రావు, డీపీఓ వెంకయ్య, ఆర్‌డబ్ల్యూఎస్, హౌసింగ్ అధికారులతో కలిసి కలెక్టర్ తాగునీరు, ఇందిరమ్మ ఇళ్లు, నర్సరీల పెంపకంపై జిల్లాలోని వాజేడు, వెంకటాపురం, కన్నాయిగూడెం, మంగపేట, ఏటూరునాగారం మండలాల అధికారులతో బుధవారం సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పనుల్లో వేగం పెంచేలా అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. నర్సరీల్లో మొక్కల పెంపకంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని అధికారులను ఆదేశించారు. జిల్లాలో ఏ ఒక్క గ్రామంలోనూ తాగునీటి ఎద్దడి తలెత్తకుండా చూడాలని, చేతి పంపులు, పైపులైన్ల మరమ్మతులను గుర్తించి వెంటనే పూర్తి చేయాలన్నారు. అవసరమైన చోట ట్యాంకర్ల ద్వారా నీటిని సరఫరా చేసేందుకు ప్రత్యేక ప్రణాళికలు సిద్ధం చేయాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు. మిషన్ భగీరథ నీరు ప్రతి ఇంటికీ అందుతున్నాయా లేదా అనే విషయంపై అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలించాలన్నారు. రాబోయే వర్షాకాలం నాటికి మొక్కలు నాటడానికి సిద్ధంగా ఉండేలా నర్సరీల్లో మొక్కలను పెంచాలన్నారు. మొక్కలకు క్రమం తప్పకుండా నీరు పోయాలన్నారు. నర్సరీల్లో గ్రీనరీ పెంపొందించేలా ప్రత్యేక సంరక్షణ చర్యలు చేపట్టాలని పంచాయతీ కార్యదర్శులకు సూచించారు. అనంతరం బండారుపల్లి గురుకుల పాఠశాలకు చెందిన పదో తరగతి విద్యార్థులకు వంశీరెడ్డి ఫౌండేషన్ పరీక్షల మెటీరియల్‌ను అందించగా కలెక్టర్ విద్యార్థులకు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్‌పర్సన్ చంద్రకళ, జిల్లా గ్రంథాలయ చైర్మన్ రవిచందర్, డీఈఓ సిద్ధార్థరెడ్డి, ఫౌండేషన్ ప్రతినిధి శ్రీనివాస్ పాల్గొన్నారు.
నేడు ప్రజాప్రతినిధులకు శిక్షణ
ప్రజా పాలన– ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా నూతనంగా ఎన్నికైన సర్పంచ్‌లకు, మున్సిపల్ కౌన్సిలర్లకు గురువారం ఇంచర్ల ఎంఆర్ ఫంక్షన్‌హాల్‌లో ఓరియంటేషన్ శిక్షణ కార్యక్రమం ఉంటుందని కలెక్టర్ తెలిపారు. ఉదయం 10 నుంచి సాయంత్రం 5 గంటల వరకు శిక్షణ కార్యక్రమం ఉంటుందని వివరించారు.
కలెక్టర్ టీఎస్.దివాకర


