‘వేప’కు విపత్తు! | - | Sakshi
Sakshi News home page

‘వేప’కు విపత్తు!

Mar 7 2026 7:22 AM | Updated on Mar 7 2026 7:22 AM

ఆందోళన అవసరం లేదు

ఎండుతున్న వేపచెట్లు

ములుగు: వేయి లాభాల చెట్టు వేపకే విపత్తు సంభవిస్తోంది. వేపచెట్టు నుంచి లభించే ఆకు, బెరడు, కాయలు, పిండి, చెక్క, నూనె తదితర ఉత్పత్తులు సర్వరోగ నివారిణిగా పేరున్నాయి. వ్యవసాయ, ఉద్యాన పంటల్లో కీటకనాశినిగా, వివిధ రకాల ఔషధాలు, చర్మ సౌందర్య ఉత్పత్తుల తయారీలో వేపకు అత్యంత ప్రాధాన్యం ఉందని చెబుతారు. ఉగాది పండుగ రోజు వేపపూవు తయారు చేసే పచ్చడిని పవిత్రంగా భావిస్తారు. ఇన్ని సుగుణాలు ఉన్న వేపచెట్టును ఐక్య రాజ్యసమితి 21వ శతాబ్ధపు చెట్టుగా గుర్తించి చరిత్రలో స్థానం కల్పించింది. దీన్ని హెర్బల్‌ ఇండియన్‌ డాక్టర్‌గా పిలుస్తున్నారు. ఇంతటి విశిష్టత కలిగిన వేపచెట్టుకు ఇప్పుడు విపత్తు రావడం చూస్తున్నాం. జిల్లా వ్యాప్తంగా ఇటీవల వందలాది వేపచెట్లు ఎండుముఖం పడుతున్న పరిస్థితి నెలకొంది. గతంలో కూడా ఇలాంటి పరిస్థితి ఉత్పన్నమైన విషయం తెలిసిందే.

ఫంగస్‌ కారణమే..

‘ఫోమాప్సిస్‌ అజాడిరక్టె’ అనే శిలీంద్రం (ఫంగస్‌) ఆశించడంతోనే వేప చెట్లు ఎండుతున్నట్లు వృక్ష శాస్త్ర నిపుణులు చెబుతున్నారు. దీనినే కొమ్మ ఎండు తెగులు అని అంటున్నారు. దీంతో చెట్టు కొమ్మలు పూర్తిగా గోధుమరంగులోకి మారి ఎండిపోయి రాలిపోతాయి. శిలీంద్ర సిద్ద బీజాలు గాలి ద్వారా ఒకచెట్టు నుంచి మరో చెట్టుకు వ్యాప్తి చెంది ఫలితంగా గాలివీచే దిశలో ఉన్న చెట్లు అన్ని వ్యాధిసోకి ఎండిపోతాయి.

వేప చెట్లపై ‘ఫోమాప్సిస్‌ అజాడిరక్టె’ అనే వ్యాధి గురించి ఆందోళన అవసరం లేదు. వ్యాధి సంక్రమించిన కొమ్మలను కత్తిరించాలి. లేదా కార్బండిజమ్‌, క్లోరోథలోనిల్‌, మాంకోజెమ్‌ వంటి శిలీంధ్రనాశకాలను నీటిలో కలిపి చెట్లపై పిచికారీ చేయాలి. లేదా వేరు దగ్గర పోయాలి. తెగులు తీవ్రమైతే పూర్తిగా ఎండిపోయి, చెట్లు చనిపోయే ప్రమాదం కూడా ఉంది. సహజంగానే వేప చెట్టుకు వ్యాధిని తట్టుకునే శక్తి ఉంటుంది. కాబట్టి భయపడాల్సిన పనిలేదు.

– సుతారి సతీష్‌, వృక్ష శాస్త్ర వేత్త, వరంగల్‌

రసం పీల్చుతున్న ‘డైబ్యాక్‌ వ్యాధి’

జిల్లాలో వందలాది చెట్లపై ప్రభావం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement