హెచ్‌పీవీతో హెల్త్‌ | - | Sakshi
Sakshi News home page

హెచ్‌పీవీతో హెల్త్‌

Mar 6 2026 8:08 AM | Updated on Mar 6 2026 8:08 AM

కిశోర బాలికలకు క్యాన్సర్‌ నివారణే లక్ష్యంగా వ్యాక్సిన్‌

రక్షణ కవచం హెచ్‌పీవీ టీకా

సద్వినియోగం చేసుకోవాలి

ములుగు రూరల్‌: మహిళల్లో అధికంగా వచ్చే గర్భాశయ ముఖద్వారా క్యాన్సర్‌ను నిరోధించేందుకు కేంద్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. కిశోర బాలికల(14–15 ఏళ్లు) ఆరోగ్యమే లక్ష్యంగా క్యాన్సర్‌ నివారణకు హెచ్‌పీవీ(హుమర్‌ పాపిల్లోమా వైరస్‌) వ్యాక్సిన్‌ వేసేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఇందుకు గాను విద్య, వైద్య ఆరోగ్యశాఖ సర్వే నిర్వహించింది. క్యాన్సర్‌ నివారణకు ప్రత్యేక చర్యలు చేపట్టింది.

వైద్యాధికారులు, సిబ్బందికి శిక్షణ పూర్తి

జిల్లా వైద్యారోగ్యశాఖ ఆద్వర్యంలో వైద్యాధికారులకు, సిబ్బందికి హెచ్‌పీవీ టీకాపై శిక్షణ ఇచ్చారు. ఇందులో 28 మంది వైద్యాధికారులు, 51 మంది పీహెచ్‌సీ వైద్యులు, 487 మంది ఆశ కార్యకర్తలకు శిక్షణ ఇచ్చారు. గ్రామీణ ప్రాంతాల్లో బాలికల తల్లిదండ్రులకు అవగాహన కల్పించి బాలికలు టీకాలు తీసుకునేందుకు సంసిద్దం చేయాలని సూచించారు.

బాలికల వివరాలు నమోదు

హెచ్‌పీవీ వ్యాక్సిన్‌ వేయించుకునే బాలికలు తప్పనిసరిగా ఆధార్‌కార్డు తీసుకు రావాలి. ఆధార్‌కు లింకు అయిన ఫోన్‌కు వచ్చే ఓటీపీతో వివరాలను ఆన్‌లైన్‌లో నమోదు చేస్తారు. వ్యాక్సినేషన్‌ పూర్తయిన తర్వాత వారికి ధ్రువీకరణ పత్రం అందజేస్తారు. ములుగు జిల్లాకేంద్రంలో జనరల్‌ ఆస్పత్రి, ఏటూరునాగారంలోని సీసీహెచ్‌సీ, వెంకటాపురం(కె)లోని సీహెచ్‌సీ సెంటర్లలో వ్యాక్సినేషన్‌ వేసేందుకు ఏర్పాట్లు చేశారు.

3,127 మందికి టీకాలు

జిల్లాలోని పది మండలాల పరిధిలో 3,127 మంది కిశోర బాలికలు ఉన్నట్లు విద్యాశాఖ రికార్డుల్లో నమోదై ఉంది. వైద్యశాఖ అధికారులు అందుకు అనుగుణంగా వ్యాక్సినేషన్‌ వేసేందుకు తగిన ఏర్పాట్లు చేస్తున్నారు. ఒక్కో బాలికకు సింగిల్‌ డోస్‌ మాత్రమే ఇవ్వనున్నారు. వ్యాక్సినేషన్‌ కేంద్రాల్లో ప్రత్యేక వైద్య నిపుణులు, మెడికల్‌ ఆఫీసర్‌, స్టాఫ్‌నర్స్‌, డాటా ఎంట్రీ ఆపరేటర్లు విధుల్లో ఉంటారు.

సిబ్బందికి ప్రత్యేక శిక్షణ ఇచ్చిన అధికారులు

3,127 మంది.. మూడు కేంద్రాల్లో వ్యాక్సినేషన్‌

ఈ నెల 8 నుంచి ప్రారంభం

ఆడబిడ్డలకు హెచ్‌పీవీ టీకా రక్షణ కవచం లాంటిదని కలెక్టర్‌ దివాకర తెలిపారు. ఈ మేరకు గురువారం కలెక్టరేట్‌లో వైద్యాధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గర్భాశయ క్యాన్సర్‌ నివారణ టీకాను కిశోర బాలికలు సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఈ నెల 8న వ్యాక్సినేషన్‌ ప్రారంభించాలని అధికారులను ఆదేశించినట్లు వివరించారు. వ్యాక్సినేషన్‌కు వచ్చే వారు ఐడీ ప్రూఫ్‌ ఆధార్‌, బర్త్‌ సర్టిఫికెట్‌, ఆపార్‌ ఐడీ తీసుకురావాలని సూచించారు. టీకాకు వచ్చే క్రమంలో అల్పాహారం తీసుకొని రావాలని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో ఆస్పత్రి సూపరింటెండెంట్‌ చంద్రశేకర్‌, ఏటూరునాగారం సూపరింటెండెంట్‌ సురేశ్‌కుమార్‌, జిల్లా వైద్యాధికారి గోపాల్‌రావు, జిల్లా ప్రోగ్రాం అధికారి శ్రీకాంత్‌, రాయినిగూడెం మెడికల్‌ ఆఫీసర్‌ నాగఅన్వేష్‌ తదితరులు పాల్గొన్నారు.

ప్రభుత్వం ఉచితంగా పంపిణీ చేస్తున్న వ్యాక్సిన్‌ను కిశోర బాలికలు సద్వినియోగం చేసుకోవాలి. ఈ నెల 8న హెచ్‌పీవీ టీకా వ్యాక్సినేషన్‌ కార్యక్రమాన్ని మంత్రి సీతక్క, కలెక్టర్‌ దివాకర ఆధ్వర్యంలో ప్రారంభించేందుకు శాఖ ఆధ్వర్యంలో ఏర్పాట్లు పూర్తి చేశాం. జిల్లాలో మూడు ప్రభుత్వ ఆస్పత్రుల్లో వ్యాక్సినేషన్‌ కేంద్రాలను ఏర్పాటు చేశాం. జిల్లా వ్యాప్తంగా బాలికల సంఖ్యను గుర్తించాం. అందుకు అనుగుణంగా వ్యాక్సిన్‌ ఇండెంట్‌ తయారు చేసి నివేధించాం.

– గోపాల్‌రావు, డీఎంహెచ్‌ఓ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement