ములుగు/ములుగు రూరల్:వైద్యాధికారులు విధుల పట్ల నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవని కలెక్టర్ టీఎస్.దివాకర హెచ్చరించారు. జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జనరల్ ఆస్పత్రిని కలెక్టర్ గురువారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆస్పత్రిలోని అత్యవసర పరీక్ష గది, వృద్ధులు, పెడియాట్రిక్ వార్డులతో పాటు ల్యాబోరేటరీ, రికార్డులను పరిశీలించారు. ఆస్పత్రిలోని విభాగాలు, వైద్యుల వివరాలపై ఆరా తీశారు. ఇన్‌పేషెంట్, ఔట్ పేషెంట్‌ల వివరాలను తెలుసుకున్నారు. రోగులకు అందిస్తున్న వైద్యసేవలు, సదుపాయాలను పరిశీలించారు. పేషెంట్లకు ఇచ్చే మందులను ఒకటికి రెండుసార్లు పరిశీలించి ఇవ్వాలని సూచించారు. అన్ని రకాల మందులు అందుబాటులో ఉంచాలన్నారు. ప్రభుత్వ ఆస్పత్రికి వచ్చే గ ర్భిణులకు వివిధ రకాల టెస్టులను ఆస్పత్రిలోనే చే యాలన్నారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో ప్రసవాల సంఖ్య పెంచాలని సూచించారు. నిర్మాణంలో ఉన్న అదనపు గదుల నిర్మాణ పనులను కలెక్టర్ పరిశీలించి పనులు త్వరగా పూర్తి చేయాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ చంద్రశేఖర్, సంబంధిత అధికారులు పాల్గొన్నారు. అలాగే ఇంచర్ల శివారు ఎర్రిగట్టమ్మ పరిధిలో నిర్మిస్తున్న భవన నిర్మాణ పనులను కలెక్టర్ పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భవన నిర్మాణ పనులు నాణ్యతా ప్రమాణాలతో వేగంగా పూర్తయ్యేలా చూడాలని అధికారులను ఆదేశించారు.
పండుగ వాతావరణంలో ప్రజాపాలన
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న ‘ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక’ కార్యక్రమాన్ని పండుగ వాతావరణంలో నిర్వహించాలని కలెక్టర్ దివాకర గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం 99 రోజుల పాటు కార్యక్రమాన్ని పండుగ వాతావరణంలో చేపట్టడానికి శ్రీకారం చుట్టిందని వివరించారు. దీనిలో భాగంగా అన్నిశాఖల అధికారులు శ్రద్ధతో సమన్వయంతో పని చేయాలని ఆదేశించారు.
కలెక్టర్ టీఎస్.దివాకర


