ములుగు: ములుగు మున్సిపల్ కమిషనర్ రమేష్‌పై నూతనంగా ఎన్నికై న సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేశారు. మున్సిపల్ సమావేశాన్ని ఆర్‌అండ్‌బీ గెస్ట్‌హౌజ్‌లో గురువారం కమిషనర్ రమేశ్ అధ్యక్షతన జరిగిన సమావేశానికి చైర్‌పర్సన్ చింతనిప్పుల చంద్రకళ హాజరయ్యారు. మున్సిపాలిటీ సాధారణ సమావేశంలోని ఎజెండా అంశాలను సమావేశంలో చదివి వినిపించారు. విపక్ష సభ్యుల పట్ల కమిషనర్ ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని, ఎజెండా తయారీలోనే తీర్మాణం ఆమోదించినట్లుగా రాశారని సభ్యులు నిరసన వ్యక్తం చేశారు. సభ్యులకు ఎజెండాను అందించే విషయంలో నిర్లక్ష్యం చేశారని ఆరోపించారు. కొన్ని తప్పులు చోటు చేసుకున్న మాటవాస్తవమేనని, ఇక నుంచి మూడు రోజుల ముందుగానే సభ్యులకు సమాచారం ఇస్తామని కమిషనర్ హామీనిచ్చారు. కొత్తగా పన్నులు పెంచవద్దని, రానున్న వేసవిలో నీటి ఎద్దడి రాకుండా చూడాలన్నారు. వీధిలైట్లు ఏర్పాటు చేయాలని, అభివృద్ధి పనుల్లో వివక్ష చూపవద్దని కౌన్సిలర్ సురేందర్ విజ్ఞప్తి చేశారు. పార్టీలకతీతంగా పట్టణాభివృద్ధికి కలిసి పని చేయాలని నాలుగో వార్డు కౌన్సిలర్ పావని ప్రస్తావించారు. అనంతరం దేవగిరిపట్నం రోడ్డు 60 ఫీట్లకు విస్తరణ, మాస్టర్ ప్లాన్ తయారీ, వీధిలైట్ల కొనుగోలు వంటి ఐదు అంశాలను ఆమోదించారు. ఈ సమావేశంలో డిప్యూటీ చైర్‌పర్సన్ ఆసియా షాహీన్, కౌన్సిలర్లు పాల్గొన్నారు.
ఏకపక్ష నిర్ణయాలు తీసుకుంటున్నారని సభ్యుల ఆరోపణ


