ఎస్‌ఎస్‌తాడ్వాయి: పోడు భూముల్లో కందకాలు తీస్తున్న అటవీశాఖ అధికారులను మంగళవారం కాల్వపల్లి రైతులు అడ్డుకున్నారు. ఈ క్రమంలో అధికారులకు పోడు రైతుల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. కాల్వపలి రైతులు భూపాలపల్లి జిల్లాలోని దూదేకులపల్లి రేంజ్ పరిధి సంగారం బీట్ పరిధిలో 25 ఏళ్లుగా సుమారుగా 162 ఎకరాల్లో 47 కుటుంబాలు పోడు భూములను సాగుచేసుకుంటున్నాయి. ఈ క్రమంలో మంగళవారం అటవీశాఖ అధికారులు రైతుల పోడు భూముల్లో మొక్కలు నాటేందుకు భూముల చుట్టూ జేసీబీతో కందకాలు తీస్తున్నారు. ఈ విషయం తెలుసుకున్న రైతులు అక్కడకు చేరుకుని తవ్వకాల పనులను అడ్డుకోవడంతో అటవీశాఖ అధికారులు, రైతులు మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. ఏళ్ల తరబడి సాగు చేస్తున్న భూములే తమకు జీవనాధారమని వాటిని వదిలే ప్రసక్తే లేదని బాధిత రైతులు అటవీశాఖ అధికారులతో వాగ్వాదానికి దిగారు. దీంతో అధికారులు తిరిగి వెళ్లిపోయారు.
రైతుల సాగులో ఉన్న పోడు భూములకు ప్రభుత్వం పట్టాలు జారీ చేయాలి. సింగారం బీట్‌లోని కాల్వపల్లి రైతులు పోడు భూములను సాగు చేస్తున్నారు. ఆర్‌ఓఎఫ్‌ఆర్ పట్టాల జారీకి దరఖాస్తులు చేసుకున్నారు. కానీ అధికారులు దరఖాస్తులను పెండింగ్‌లో పెట్టారు.
– కొప్పుల రవికుమార్, ఆదివాసీ విద్యార్థి సంఘం రాష్ట్ర అధ్యక్షుడు, కాల్వపల్లి
అటవీశాఖ అధికారులను
అడ్డుకున్న రైతులు


